శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి నుంచి హిందూపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బెంగళూరు నుంచి పులివెందుల దిశగా వెళ్తున్న సిమెంట్ లారీని ప్రమాదవశాత్తు ఢీకొంది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి 108 అత్యవసర వాహనం ద్వారా క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

