AP

వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యం: జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్

కదిరి, జనవరి 19:

సోమవారం రాత్రి కదిరి పట్టణంలోని అడపాల వీధిలో హేమలత నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ప్రతిరోజూ తరగతులకు హాజరై చదువుతోపాటు డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతను కూడా అవగాహన చేసుకోవాలని, తద్వారా ఎలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు. చదువు వల్ల ప్రతి వ్యక్తికి సమాజంలో గౌరవం పెరుగుతుందని, జీవనంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. అలాగే తమ కుటుంబాలలోని పిల్లలకు కూడా చదువు ప్రాధాన్యతను తెలియజేస్తూ, మంచి భవిష్యత్తు కోసం ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వాలంటీ టీచర్‌గా సేవలందిస్తున్న హేమలత గౌరవభృతి ఇవ్వాలంటూ అభ్యర్థించగా, కనీసం మూడు నెలలపాటు (మార్చి వరకు) గౌరవభృతి అందించేందుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, సత్యసాయి జిల్లా నోడల్ ఆఫీసర్ ఈ. జనార్దన్ గౌడ్, వయోజన విద్యా సూపర్వైజర్లు రవీంద్రనాయుడు, సుధాకర్, స్వచ్ఛ భారత్ ఎంసీఓలు ప్రసాద్, గంగాధర్, టీపీఆర్ఓ సతీష్ కుమార్, సిఎంఎం శివకుమార్, సీఓలు గిరి, కృష్ణమూర్తి, ఆంజనేయులు, ఆర్‌పీ శోభ తదితరులు పాల్గొన్నారు.