పులివెందుల పట్టణంలో మాజీ ఎస్.కె. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ప్రముఖ న్యాయవాది మరియు హేతువాది కీర్తిశేషులు శ్రీ గండి జయరాం యాదవ్ గారి సంస్మరణ సభ నేడు అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాం యాదవ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వేమయ్య యాదవ్ మాట్లాడుతూ.. జయరాం యాదవ్ విద్యార్థి దశ నుంచే సమాజంపై అవగాహన కలిగి ఉండేవారని, న్యాయవాదిగా బాధితుల పక్షాన నిలబడటమే కాకుండా హేతుబద్ధమైన ఆలోచనలతో సమాజ మార్పు కోసం కృషి చేశారని కొనియాడారు. వారి మరణం జిల్లా రాజకీయ మరియు సామాజిక రంగానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జయరాం యాదవ్ గారు చూపిన మార్గం ఆదర్శనీయమని పేర్కొన్నారు.
అనంతరం జయరాం యాదవ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ పరంగాను మరియు వ్యక్తిగతంగానూ ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా తమ సహాయ సహకారాలు ఉంటాయని వేమయ్య యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పాల్గొని జయరాం యాదవ్ గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

