AP

లడ్డూ వివాదంపై బాబును వదిలేయొద్దు: ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ ధ్వజం!

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారని విమర్శించారు. కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని, వాస్తవానికి చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్ల సరఫరా జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సింది, క్షమాపణలు కోరాల్సింది చంద్రబాబేనని జగన్ స్పష్టం చేశారు.

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని గుర్తించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని జగన్ మండిపడ్డారు. శాసనసభలో తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నందున, శాసనమండలిలో తమకు ఉన్న సంఖ్యా బలాన్ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని, ప్రభుత్వం చేసే తప్పుడు ప్రచారాలను ఎండగట్టాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.

కూటమి ప్రభుత్వ పాలన అంతా స్కామ్‌ల మయంగా మారిందని, విశాఖలో రూ. 5 వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన బంధువులకు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులు, భౌతిక దాడులకు భయపడాల్సిన అవసరం లేదని, మండలి వేదికగా అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు.