AP

అంగన్వాడి వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేయాలి… రిలే నిరాహార దీక్షలో గోవిందమ్మ, మేరీ డిమాండ్..

అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం

అంగన్వాడి వర్కర్లకు తక్షణమే గ్రాట్యుటీ అమలు చేయాలని రాయదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యదర్శి మేరీ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలో భాగంగా రాయదుర్గం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్లు నిరాహార దీక్షను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్లు ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో సేవలందిస్తున్నప్పటికీ వారికి సరైన భద్రతా, సంక్షేమ సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు:
అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలి
పెండింగ్‌లో ఉన్న 1,810 మినీ వర్కర్లకు అర్హతల సడలింపు ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలి
గ్రాట్యుటీ అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు (గైడ్‌లైన్స్) రూపొందించాలి
వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలి
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలి
లబ్ధిదారులకు అందించే ఆయిల్, కందిపప్పు పరిమాణం పెంచాలి
మెనూ ఛార్జీలు పెంచాలి
అంగన్వాడి కేంద్రాలకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి
డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి రాధమ్మతో పాటు సెక్టార్ లీడర్లు రాధిక, మెహరూన్, అనురాధ, లలిత, శోభ, సావిత్రి పాల్గొన్నారు. రాయదుర్గం, గుమ్మగట్ట, డీ.హీరేహళ్ మండలాల అంగన్వాడి వర్కర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఐక్యత చాటారు.