AP

వైఎస్సార్‌పై అనుచిత వ్యాఖ్యలు తొలగించండి: అసెంబ్లీ వేదికగా ఏపీ సర్కార్‌పై షర్మిల ఆగ్రహం

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పేరును ప్రస్తావించడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ చేసిన తప్పులను వైఎస్సార్‌కు ఆపాదించడం సరికాదని ఆమె హితవు పలికారు. అసెంబ్లీ రికార్డుల నుంచి ఆయనపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ, కూటమి ప్రభుత్వం ‘అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు’ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ హయాంలో ఏడు కొండలను రెండు కొండలు చేయాలని చూశారన్న విమర్శలను షర్మిల గట్టిగా తిప్పికొట్టారు. వాస్తవానికి 2007లో “ఏడు కొండలు వెంకన్నవే” అని స్పష్టం చేస్తూ శాశ్వత జీవో ఇచ్చింది వైఎస్సార్ అని ఆమె గుర్తు చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడానికి జీవోలు (746, 747) తీసుకురావడమే కాకుండా, 2009లో తిరుమల లడ్డూకు అంతర్జాతీయంగా పేటెంట్ హక్కులు సాధించింది కూడా ఆయనేనని, అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబే బురద చల్లారని ఆమె ఆరోపించారు.

వైసీపీకి, వైఎస్సార్ సిద్ధాంతాలకు అసలు సంబంధమే లేదని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన దోచుకుతినే పాలన అని, కానీ వైఎస్సార్ పాలన పేదల సంక్షేమ పాలన అని ఆమె పేర్కొన్నారు. “వైసీపీలో అసలు వైఎస్సార్ లేనే లేడు” అని, ఆయన కడవరకు కాంగ్రెస్ మనిషిగానే బతికారని స్పష్టం చేశారు. వేద పండితుల కోసం, దళితుల కోసం వైఎస్సార్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, అటువంటి మహానేతను వ్యక్తిగతంగా దూషించడం భావ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు హితవు పలికారు