AP

తిరుమలపైకి జగన్ అనకొండలను పంపిస్తున్నారు: టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తు

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్న జగన్ మోహన్ రెడ్డి ఏడుకొండలపైకి ‘అనకొండలను’ పంపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ నేతలు ఇప్పుడు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

దాదాపు 11 నెలల క్రితం జరిగిన ఒక పాత ఘటనను నిన్ననే జరిగినట్లుగా చిత్రీకరిస్తూ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. పరకామణిలో చోరీకి ప్రయత్నించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని తాము పట్టుకుని జైలుకు పంపించామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా గత వైకాపా పాలనలో జరిగిన రవికుమార్ దొంగతనం ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో విజిలెన్స్ ద్వారా ఆధారాలను మాయం చేసింది వాస్తవం కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

శ్రీవారి హుండీలో కానుకలు పడకుండా చేసి, తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమే వైసీపీ అసలు లక్ష్యమని భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని అనకొండలు వచ్చినా ఆ ఆదిశేషుడి ముందు తోక ఆడించలేవని ఆయన హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో తాము వెనకడుగు వేయబోమని, అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.