ఏపీలో మూడు రాజధానుల కథ కంచికి చేరినట్టే తెలుస్తోంది. ఎందుకంటే ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండాలని కూటమి సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా మరోసారి ఏపీ ప్రజలు రాజధాని లేకుండా ఇబ్బందులు పడరాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిన్న ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిపి ఆ బిల్లును సభలోని సభ్యులు ఆమోదించారు. అయితే, అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో వైసీపీ మాత్రం సభకు హాజరు కాలేదు. వైఎస్ జగన్ సైతం దూరంగా ఉన్నారు.దీంతో వైసీపీ కుఠిల రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని తెలుగుతమ్ముళ్లు విమర్శిస్తున్నారు.
జగన్‌కు ఇష్టం లేదా?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో సభలో లేరు. వైసీపీ ఎమ్మెల్యేలు సైతం రాలేదు. ఇంతకూ జగన్‌కు అమరావతిని రాజధానిగా చేయడం ఇష్టం లేదా? ఉంటే సభకు ఎందుకు హాజరుకాలేదు. భవిష్యత్‌లో జగన్ ముఖ్యమంత్రి అయితే మరల రాజధానిని మారుద్దామని అనుకుంటున్నారా? అని ఏపీ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.2014లో నాటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అందుకు జై కొట్టారు. మరల తాను సీఎం అయ్యాక అమరావతి రియల్ మాఫియా చేతుల్లో ఉందని ఆరోపించారు. అనంతరం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు.
చట్టబద్ధత వస్తే ఫైనల్..
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.దీనిని పార్లమెంటు ముందుకు తీసుకువచ్చేందుకు ఏపీ సర్కార్ కేంద్రానికి పంపించింది. కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం ఏపీకి చట్టబద్దత కలిగిన రాజధానిగా అమరావతిని గర్తించే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.అక్కడ ఆమోదం అనంతరం చట్టరూపం దాల్చనుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం అధికారిక గెజిట్ విడుదల కానుంది. ఆ తర్వాత ఏపీలో ఎన్ని ప్రభుత్వాలు మారిన అమరావతిని రాజధానిగానే కొనసాగించాల్సి ఉంటుంది. మార్పులు చేయడానికి వీలు ఉండదు.ఈ విషయం జగన్‌కు మింగుడు పడటం లేదని తెలుస్తున్నది. అందుకే ఆయన అసెంబ్లీకి హాజరుకాలేదని సమాచారం. మరల జగన్ అధికారంలోకి వచ్చినా మూడు రాజధానుల అంశం ఇక కేవలం మాటలకే పరిమితం కానుంది.
అమరావతి కేంద్రంగా రాజధాని భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ వంటివి కొనసాగునున్నాయి. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన,ఉద్యోగుల బదిలీ ప్రక్రియ,కార్యనిర్వహక పాలన అంతా అక్కడి నుంచే కొనసాగనుంది. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చెల్లుబాటు కావు. ఒకవేళ ఆయన మరల సీఎం అయితే ..వైజాగ్ కేంద్రంగా పాలన సాగించినా రాజధానిగా మాత్రం అమరావతే కొనసాగనుంది.శానస,కార్యనిర్వాహక, న్యాయ రాజధాని అంటూ ఇక ఏమీ ఉండవు. జగన్ ఆశల మీద కూటమి సర్కార్ నీళ్లు చల్లిందని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. అమరావతి రైతులు మాత్రం కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ ప్రభుత్వం మారిన తమకు ఎటువంటి ఇబ్బందులు వాటిల్లవని ధీమాతో ఉన్నారు.

