AP

లోక్‌సభలో ఏపీ పునర్విభజన బిల్లు.. రెండు గంటలపాటు చర్చ, కాంగ్రెస్ పూర్తి మద్దతు

ఏపీ శాశ్వత రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. జీవో అవర్ ప్రారంభంలో పలు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అందులో జనవిశ్వాస, ఎఫ్‌సీఆర్ఏ(ఫారెన్ కంటిబ్యూషన్‌కు సంబంధించినది) వీటితోపాటు ఏపీ పునర్విభజన బిల్లు కూడా రానుంది.

 

లోక్‌సభలో ఏపీ పునర్విభన బిల్లులో రాజధాని అమరావతిపై చర్చ

 

ఏపీ రాజధాని అమరావతి బిల్లుపై సభలో రెండు గంటలపాటు చర్చ జరగనుంది. తొలుత ఈ బిల్లును హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశ పెట్టారు. ఏపీ రాజధాని చట్ట బద్దత బిల్లును కాంగ్రెస్ సమర్థించింది. దీనిపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాణికాం ఠాగూర్ మాట్లాడారు. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతికి పన్నులు ఎందుకు మాఫీ చేయడం లేదన్నారు.

 

రాజధాని అమరావతికి కేంద్రం సంపూర్ణంగా సహకారించాలన్నారు. అంతేకాదు అమరావతికి తగినన్ని నిధులు ఇవ్వాలన్నారు. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నారు. అలాగే విశాఖ ఉక్కును కేంద్రం ఆదుకోవాలన్నారు. విశాఖలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి సహకరించాలన్నారు. తిరుపతిలో మౌలిక సదుపాయాలు వేగవంతం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు.

 

అటు టీడీపీకి చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని అన్నారు. అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం తన అదృష్టమన్నారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలన్నారు.

 

సంపూర్ణ మద్దతు ప్రకటించి కాంగ్రెస్.. జగన్ వైఖరిపై టీడీపీ, రాజధాని రైతుల సమస్యలపై వైసీపీ ప్రస్తావన

 

అమరావతి కోసం పోరాడిన మహిళలకు జేజేలు పలికారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని గుర్తు చేశారు. వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం, అవమానంపై మాట్లాడాలన్నారు.

 

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో రాజధాని మహిళలు యాత్ర చేపడితే వేధించారని తెలియజేశారు. రాజధాని మహిళా రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయన్నారు. రాష్ట్రాభివృద్ధిలో రాజధాని కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బెంగుళూరు, చెనై, హైదరాబాద్ లు ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని వివరించారు.

 

అలాగే ఏపీ అభివృద్ధిలో అమరావతి కీలక పాత్ర పోషించాలన్నారు. రాజధాని నిర్ణయం, మార్పు కేంద్రం పరిధిలో ఉంటుందని 2022లో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని చర్చ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉంటే పెట్టుబడులు రావన్నారు. అటు బీజేపీ తరపున అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఈ బిల్లుపై మాట్లాడారు. ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అమరావతి అని అన్నారు.

 

ప్రజా రాజధాని అమరావతి చరిత్రంలో గుర్తు ఉంటుందన్నారు. అమరావతికి చట్టబద్ధతకు ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ సహకరించారన్నారు. ఈ బిల్లు ఏపీకి రాజధానిని ఇస్తుందన్నారు. ఈ బిల్లుతో అమరావతిని ఎవరూ అంగుళం కూడా కదల్చలేరన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అమరావతితో మూడు ముక్కలాట ఆడలేరన్నారు. ఇకపై ఊసరవెల్లిలా రంగులు మార్చలేరన్నారు.

 

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజధానిపై కొత్త నాటకాలు మొదలుపెట్టారని ఘాటుగా విమర్శించారు. మూడుముక్కలాటతో కాలక్షేపం చేశారే తప్ప, ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. న్యాయబద్దంగా రైతులు నిరసన తెలుపుతుంటే మహిళలపైనే రాక్షసంగా ప్రవర్తించారన్నారు. అటు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడారు. రాజధాని కోసం 34 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చారన్నారు.

 

రాష్ట్ర రాజధానుల విషయంలో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఏడేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నా రైతులకు చేసిందేమీ లేదన్నారు. రైతులకు పేపర్లపై ప్లాట్లు కేటాయించారు తప్ప ఇవ్వలేదన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదన్నారు.

 

రైతుల వేదనను చంద్రబాబుకు పట్టలేదన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పుటి లోగా నెరవేర్చుతారు? అమరావతి అనే పేరు మాత్రమేకాదు, రైతులకు ఏం చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. 50 వేల ఎకరాలు ఉండగా, మరో 50 వేల ఎకరాలు కావాలని అంటున్నారని వివరించారు.

 

కోల్‌కతా కేవలం 51 వేల ఎకరాల్లో రాజధాని ఉందన్నారు. ఢిల్లీ కేవలం 15 వేల ఎకరాల్లో నిర్మాణం జరిగిందన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబుకు స్పష్టత లేదని కుండబద్దలు కొట్టేశారు. అదనపు భూసేకరణ అవసరం ఏంటని ప్రశ్నించారు.