AP

జగన్, వి.సా.రెడ్డి విదేశీ టూర్స్ – సీబీఐ వ్యతిరేకిచినా కోర్టు అనుమతి !

సీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. వారి విదేశీ పర్యటనలపై సందేహలున్నాయని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని ..

సాక్షులను బెదిరిస్తారని అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వారిద్దరికీ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. సీఎం జగన్ రెడ్డి సెప్టెంబర్ రెండో తేదీ నుంచి పది రోజుల పాటు యూకేకు వెళ్తారు. అక్కడ ఆయన కుమార్తెలు చదువుతున్నారని చెబుతున్నారు. అయితే గతంలో ఓ కుమార్తె ఫ్రాన్స్ కాలేజీలో చేరినట్లుగా ప్రచారం జరిగింది.

విజయసాయిరెడ్డి మరీ విచిత్రమైన కారణాలతో.. వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా ఓ నెల రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తానని దరఖాస్తు చేసుకున్నారు. విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈయన విదేశీ పర్యటననూ సీబీఐ వ్యతిరేకిచింది. అయినా సీబీఐ వాదన లెక్కలోకి రాలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఏ 1, ఏ 2 నిందితులుగా ఉన్నారు. గతంలో సీబీఐ అరెస్ట్ చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చారు.

బెయిల్ షరతుల్లో పాస్ పోర్టు కోర్టుకు సరెండర్ చేయాలని.. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలన్న నిబంధన ఉంది. ఈ కారణంగా వారిద్దరి పాస్ పోర్టు కోర్టు అధీనంలో ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి తీసుకుంటూ ఉంటారు. ఎన్నికలకు ముంద వీరిద్దరూ విదేశీ పర్యటనలు పెట్టుకోవడంతో సహజంగానే విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి.