AP

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు ముహూర్తం ఖరారు..! ఎప్పుడంటే..?

ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలతో ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం . ఇప్పటికే ఆర్సెలార్‌ మిట్టల్-నిప్పన్‌ స్టీల్ ప్రాజెక్టుకు పునాదిరాయి పడింది. అక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు గూగుల్ వంతు అయ్యింది. గూగుల్ డేటా సెంటర్‌కు సంబంధించి పునాదిరాయి ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.

 

విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

 

ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చకున్న సంస్థలు ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్-నిప్పన్‌ స్టీల్ ప్రాజెక్టుకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు గూగుల్ సంస్థ వంతైంది. డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం ఆరు నెలల కిందట కుదిరింది.

 

ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలని గూగుల్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఏప్రిల్ 28న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతోపాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యే అవకాశముంది. గూగుల్‌ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తోపాటు ఆ సంస్థ ప్రతినిధులు హాజరుకానున్నారు.

 

సీఎం చంద్రబాబుతోపాటు పలువురు కేంద్రమంత్రులు హాజరు

 

1 గిగావాట్ సామర్థ్యం గల గూగుల్ డేటా సెంటర్‌ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది గూగుల్. దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. గూగుల్ డేటా సెంటర్ల కోసం విశాఖ సిటీలోని అడవివరం, తర్లువాడ, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.

 

ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమిని అప్పగించింది ప్రభుత్వం. తర్లవాడ లేదా రాంబిల్లి ప్రాంతాల్లో తొలుత శంకుస్థాపన చేయాలని ఆ కంపెనీ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం రాంబిల్లిలో 174.8 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, తర్లవాడలో 266 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించింది.

 

ఒక గిగావాట్ సామర్థ్యం గల మూడు డేటా సెంటర్లను 2028 జూలై నాటికి ప్రారంభించాలని ఓ అంచనా. డేటా సెంటర్ల ఏర్పాటులో భాగంగా మూడు అధిక సామర్థ్యం గల సబ్‌మెరైన్ కేబుళ్లు, ప్రత్యేక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు, అధిక సామర్థ్యం గల మెట్రో ఫైబర్ లైన్లు, టెలికమ్యూనికేషన్ల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

 

గూగుల్ దాని అనుబంధ సంస్థలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది. అందులో అమెరికా, తైవాన్, జపాన్, సింగపూర్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, బెల్జియం, చిలీ వంటి దేశాల్లో డేటా సెంటర్లు ఉన్నాయి. అయితే విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ క్లస్టర్ ఆసియాలో అతిపెద్దదిగా చెబుతున్నారు ఆ సంస్థ ప్రతినిధులు.