AP

52 రోజుల తర్వాత.. జైలు నుంచి విడుదల.. తొలి స్పీచ్..

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్‌ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో చంద్రబాబును చూసి టీడీపీ నేతలు భావాద్వేగానికి గురయ్యారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు.

 

జైలు నుంచి బయటకు రాగానే చంద్రబాబు మాట్లాడారు. తాను జైలులో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తనపై ఎంతో అభిమానం చూపించారని అన్నారు. భారత్ దేశంలోనేకాదు ప్రపంచ దేశాల్లో చూపించిన అభిమానం జీవితంలో మర్చిపోలేనన్నారు. తాను చేసిన అభివృద్ధిని ప్రపంచం మొత్తానికి చూపించారని తెలిపారు.

 

45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఏ తప్పు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఎవర్నీ కూడా తప్పు చేయనీయలేదని స్పష్టం చేశారు. తనపై అభిమానం చూపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు చాలా రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేశాయన్నారు. ప్రజాజీవితం తాను చేసిన సేవలను గుర్తు చేసుకున్నారని తెలిపారు.

 

జనసేన మద్దతు ఇచ్చిన అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు సంఘీభావం తెలిపిన ఇతర పార్టీల నేతలకు ధన్యావాదాలు తెలిపారు.

 

తమ పార్టీ అధినేత జైలు నుంచి విడుదల కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జైలు వద్దకు వచ్చారు. మనవడు దేవాన్ష్ బుగ్గును నిమురుతూ ముచ్చటించారు.

 

 

52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. వారిని నిలువరించేందుకు పోలీసుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినసరే తోసుకుంటూ జైలువద్దకు దూసుకొచ్చారు. జైలు పరిసర ప్రాంతాలు జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు.