AP

2029లో వచ్చేది నేనే..! జగన్ మాస్ వార్నింగ్..

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి, స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “చంద్రబాబు నాయుడు గారూ.. కళ్ళు మూసి తెరిచేసరికే మరో మూడేళ్లు అయిపోతుంది.. వచ్చేది మళ్ళీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే! ఈ జువ్వలదిన్నెలో మత్స్యకారుల పొట్టకొట్టి మీరు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన భూములను తిరిగి తీసుకుంటాం.. ఆ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాం” అని జగన్ ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్రంలో తాము నిర్మించిన ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తని, వాటిని ఎవరూ తీసుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

జువ్వలదిన్నె ప్రాజెక్టు పూర్తయి రెండేళ్లు దాటినా, ఇప్పటికీ దానిని మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదని జగన్ ప్రశ్నించారు. “నేను మార్చి 12, 2024న ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాను. మళ్ళీ ప్రధాని మోదీ గారు ఆగస్టు 2024లో ప్రారంభించారు. అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు దీనిని మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని నిలదీశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించి ‘బ్లూ ఎకానమీ’ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలని తాము ప్రణాళిక చేశామని ఆయన గుర్తు చేశారు.

 

మత్స్యకారులకు కేటాయించిన 79 ఎకరాల భూమిలో సగం భూమిని ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు కట్టబెట్టడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. “ప్రైవేట్ వాళ్ళకు భూములు ఇవ్వాలనుకుంటే పక్కనే ఉన్న కృష్ణపట్నం పోర్టులో ఇవ్వచ్చు.. కానీ మత్స్యకారుల కోసం కట్టిన హార్బర్‌లో వారికి చోటు లేకుండా చేయడం ధర్మమేనా?” అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం ఉండి ఉంటే, ఈపాటికే 1250 బోట్లు ఇక్కడ యాంకర్ అయ్యి ఉండేవని, సుమారు 25 వేల మత్స్యకార కుటుంబాలు దీనిపై ఆధారపడి బతికేవని ఆయన పేర్కొన్నారు. ఒక్కో బోటుకు 12 మంది మత్స్యకారులను యజమానులుగా చేస్తూ, వారికి 90 శాతం ఆర్థిక భరోసా కల్పించేలా తాము అడుగులు వేశామని గుర్తు చేశారు.

 

జువ్వలదిన్నె హార్బర్‌లో తాము ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీలు, ఐస్ మేకింగ్ ప్లాంట్లు, బోట్ రిపేర్ షెడ్లు, నెట్ మెండింగ్ మిషన్లు అన్నీ ప్రస్తుతం మూలన పడి ఉన్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 41 వేల టన్నుల మత్స్య సంపదను హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఉన్న ఈ హార్బర్, ప్రస్తుతం చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారిందని విమర్శించారు. మత్స్యకార మహిళలకు ప్యాకింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఉపాధి కల్పించాలనే తమ ఆశయం నెరవేరలేదని అన్నారు. మత్స్యకారుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని, రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అన్యాయాలన్నింటినీ సరిదిద్దుతామని జగన్ భరోసా ఇచ్చారు.