మంచు మనోజ్(Manchu Manoj) అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మనోజ్.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి మనోజ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్.. రెండు గాడి తప్పాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కెరీర్ పరంగా వెనకపడ్డారు. మరోవైపు భార్య ప్రణతితో విడిపోయి విడాకులు తీసుకున్నాడు. అయితే దివంగత భూమా నాగిరెడ్డి-శోభ దంపతుల కుమార్తె భూమా మౌనిక రెడ్డి(Bhuma Mounika Reddy)ని మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా పలుమార్లు మీడియాకు చిక్కడం నెట్టింట జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. గత ఏడాది వినాయక చవితి సమయంలో మనోజ్, మౌనిక కలిసి పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత కడప దర్గాకి వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘త్వరలో కొత్త జీవితం మొదలు పెడుతున్నా, ఈసారి ఇక్కడికి ఫ్యామిలీతో వస్తా’ అంటూ కామెంట్స్ చేశాడు. ఇక తాజాగా మనోజ్(Manoj) చేసిన ట్వీట్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్లే ఉంది. నేడు మౌనిక రెడ్డి తండ్రి స్వర్గీయ భూమా నాగిరెడ్డి జయంతి. ఈ నేపథ్యంలోనే మనోజ్ `ఆయన ఒక గొప్ప లీడర్ మాత్రమే కాదు.. ఒక గొప్ప కొడుకు, భర్త, తండ్రి అంతకుమించి ఒక గొప్ప మనుసు ఉన్న వ్యక్తి. ఆయనే భూమా నాగిరెడ్డి(Bhuma Nagi reddy) గారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన అశీసులు మాత్రం ఎప్పుడు మనపైనే ఉంటాయి` అని పేర్కొంటూ భూమా నాగిరెడ్డి ఫోటోలను ట్విట్టర్ ద్వారా మనోజ్ పంచుకున్నాడు. ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో మౌనిక రెడ్డితో మనోజ్ పెళ్లి ఖాయమంటూ వార్తలు ఊపందుకున్నాయి. కాగా, మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. మౌనికా రెడ్డి ఇదివరకే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్నారు.