CINEMA

సీనియర్ హీరోలను రూటు మార్చమంటున్న ట్రెండ్

ట్రెండ్ మారుతోంది. దానికి అనుగుణంగానే దర్శక రచయితలు ప్రేక్షకులను ఎంత వినూత్నంగా ఆకట్టుకోగలమా అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కేవలం సినిమాలతోనే కాకుండా పేరు డబ్బు సంపాదించడానికి ఓటిటి రూపంలో కొత్త మార్గం కనిపెట్టబడి ఉందని గుర్తించి దానికి అనుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకుంటున్నారు. హిందీలో మొదలైన వెబ్ సిరీస్ ల ట్రెండ్ క్రమంగా తెలుగుకు పాకుతోంది. కొన్నేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్ జగపతిబాబు ప్రధాన పాత్రలో గ్యాంగ్ స్టర్స్ తో పేరుతో ఓ భారీ బడ్జెట్ సిరీస్ తో తీసింది కానీ అది ఆశించిన విజయం సాధించకపోవడంతో కొంత గ్యాప్ వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ బ్లాక్ బస్టర్ కావడం సమంతా లాంటి నోటెడ్ హీరోయిన్ సెకండ్ సీజన్ లో భాగం కావడంతో వీటికి ఊపొచ్చింది. ఆహా లాంటి యాప్స్ ఇలాంటి ప్రయత్నాలు చేశాయి కానీ బడ్జెట్ తో పాటు క్యాస్టింగ్ పరిమితుల వల్ల అవి మరీ పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు వస్తోంది. భారీగా ఖర్చు పెట్టి తీశారని ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. వెంకటేష్ లాంటి సీనియర్ మోస్ట్ టాప్ స్టార్ దీనికి ఒప్పుకోవడం ఒక ఎత్తయితే, తెల్ల గెడ్డం జుట్టుతో వయసు మళ్ళిన రానా తండ్రి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో ట్విస్ట్. దృశ్యంలో టీనేజ్ అమ్మాయికి నాన్నగా నటించడం కన్నా ఇది పెద్ద మలుపు. హిందీలో ఇలాంటివి ఎప్పుడో వేగమందుకున్నాయి. అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద తారలందరూ డిజిటల్ బాట పట్టేశారు. తమిళంలో సూర్య, విజయ్ సేతుపతిలు ఓ యాంతాలజీలో భాగం పంచుకున్నారు.

హీరోయిన్ల సంగతి సరేసరి. సాయిపల్లవితో మొదలుపెట్టి రకుల్ ప్రీత్ సింగ్ దాకా అందరూ ఎంట్రీ ఇచ్చేశారు. రెమ్యునరేషన్లు గట్రా ఆకర్షణీయంగా ఉండటం కారణమని వేరే చెప్పాలా. కన్నడ మలయాళంలో మాత్రమే ఇంకా వెబ్ సిరీస్ ల ఉనికి పెద్దగా లేదు. అక్కడ రావడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. ఫిఫ్టీ సిక్స్ టీ దాటిన అగ్ర హీరోలు ఈ తరహా ఆలోచనలు చేయడం అవసరం. ప్రతిసారి ఊర మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్లకు ఒకే ఫలితం దక్కదు. జనం బోర్ గా ఫీలయ్యారంటే తిప్పి కొట్టేస్తారు. థియేటర్ కు రావడానికి ప్రత్యేక కారణాలు వెతుకుతున్న జనరేషన్ లో రొటీన్ ఫార్ములాతో మళ్ళీ మళ్ళీ సక్సెస్ కొట్టలేం. వెంకటేష్ బహుశా అందుకే రూటు మార్చినట్టు కనిపిస్తోంది. అది కూడా స్ట్రెయిట్ హిందీ వెర్షన్ చేయడం ద్వారా కొత్తనీరుని స్వాగతమిస్తాననే సందేశం ఇచ్చినట్టే. ఇది హిట్టవుతుందా లేదానేది పక్కనపెడితే మారుతున్న అభిరుచులకు ఇది మొదటి మెట్టనే చెప్పాలి.