CINEMA

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపటి క్రితం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి చెందారు. అనారోగ్య కారణాలతో రాజ్ మరణించినట్లు తెలిసింది.
‘రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు గాంచిన రాజ్ మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది.

తెలుగు సినీ పరిశ్రమకు ప్రముఖ సంగీత దర్శకుల్లో రాజ్- కోటి ద్వయం ఒకటి. తొంభైల్లో వచ్చిన సినిమాల్లో రాజ్ కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు ఎన్నో మ్యూజికల్ హిట్స్ సాధించాయి. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తర్వాత వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారు విడివిడిగా సినిమాలు చేశారు.

అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడే ఈ రాజ్. ప్రళయ గర్జన అనే సినిమాతో రాజ్ కోటి సినిమా ప్రయాణం మొదలు కాగా.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సంగీత ప్రపంచాన్ని ఏలారు. ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించి పాపులర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమాతో రాజ్ కోటి దశ తిరిగింది. లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, హలొ బ్రదర్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలకు ఈ రాజ్ కోటి ద్వయం బాణీలు కట్టింది. అయితే కోటితో విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువగా సినిమాలు చేయలేదు.

కొన్ని విబేధాల కారణంగా రాజ్ కోటి విడిపోయారని విన్నాం. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాము ఎందుకు విడిపోయామనే విషయాన్ని కోటి వెల్లడించారు. వాస్తవానికి రాజ్ తనకీ ఎలాంటి విభేదాలు లేవని, తాను పాటలకు కండక్టింగ్ బాగా చేసే వాడని, తాను కంపోజింగ్ చేసేవాడినని అన్నారు. ఏదైనా ఇద్దరం కలసే పనిచేసేవాళ్లమని చెప్పారు. ఏ క్రెడిట్ వచ్చినా రాజ్ కోటికి కలిపి వచ్చేదని అన్నారు. అయితే ఒక్కోసారి హీరో, డైరెక్టర్లు వచ్చి తనతో మాట్లాడేవారని.. అది రాజ్ కు నచ్చేది కాదని కోటి తెలిపారు. నిజానికి రాజ్ అలాంటి చిన్న చిన్నవి పెద్దగా పట్టించుకోరని, కానీ పక్కన ఉన్నవారి చెప్పుడు మాటలు విని తాను దూరమైపోయాడని కోటి అన్నారు.