CINEMA

“అందుకే ముందు కమెడియన్ అయ్యా”: బలగం దర్శకుడు వేణు ఎల్దండి

ఈ ఏడాది మార్చి ముందు వరకు కమెడియన్‍గానే అందరి మదిలో ఉన్న వేణు ఎల్దండి.. ‘బలగం’ సినిమా తర్వాత దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు.

బలగం చిత్రంతో దర్శకుడిగా అతడు అంత ప్రభావాన్ని చూపాడు. కెరీర్ ఆరంభంలో జబర్దస్త్ షో సహా చాలా చిత్రాల్లో కమెడియన్‍గా చేశాడు వేణు. దీంతో కమెడియన్‍గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఒక్క ‘బలగం’ సినిమాతో ఇప్పుడు అతడిని అందరూ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా చూస్తున్నారు. బలగం చిత్రాన్ని వేణు అంత గొప్పగా రూపొందించడమే ఇందుకు కారణం. తెలంగాణ సంస్కృతి, అచారాలను చూపడంతో పాటు భావోద్వేగాలతో సినిమాను అతడు తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చింది. దీంతో బలగం సినిమా సూపర్ హిట్ అవడమే కాక.. ప్రతిష్టాత్మక అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది. అయితే, తన జీవితంలో ముఖ్యమైన విషయాలను తాజాగా న్యూస్ ఏజెన్సీ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు ఎల్దండి పంచుకున్నాడు. తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నాడు.

కెరీర్ ఆరంభంలో తనను అందరూ బాబు మోహన్‍లా ఉన్నావని అనేవారని, అందుకే తాను ముందు కమెడియన్ అవ్వాలని నిర్ణయించుకున్నానని వేణు ఇంటర్వ్యూలో చెప్పాడు. 1999లో కేవలం రూ.200తో హైదరాబాద్‍కు వచ్చేశానని గుర్తు చేసుకున్నాడు. “నేను రూ.200తో 1999లో హైదరాబాద్‍కు వచ్చా. చాలా కష్టాలను ఎదుర్కొన్నా. అయితే ఎప్పుడూ ఏకాగ్రతను కోల్పోలేదు. సినిమాలు తీయాలనేదే నా పెద్ద కలగా ఉండేది. అయితే, నేను చూడడానికి కమెడియన్ బాబు మోహన్‍లా ఉన్నానని అందరూ అనేవారు. దీంతో నేను కమెడియన్ కావాలనుకొని అయ్యా. చాలా ఇతర పనులు కూడా చేశా” అని వేణు చెప్పాడు.

జబర్దస్త్ షో వదిలేశాక తనకు సినిమాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని, దీంతో ఓ దశలో తీవ్రమైన డిప్రెషన్‍లోకి వెళ్లానని వేణు చెప్పాడు. అయితే, సొంతంగా ఓ సినిమాకు డైరెక్షన్ చేయాలని అప్పుడు బలంగా నిశ్చయించుకొని కథ కోసం వెతికానని అన్నాడు. ఆ అన్వేషణలోనే బలగం కథ రాసుకున్నానని, ఆ సినిమా అలాగే పుట్టిందని వేణు చెప్పాడు.