రెజీనా కాసాండ్రా గతంలో తెలుగు హీరోల పక్కన గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండేది. కానీ రూట్ మార్చిన ఈ భామ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపిస్తోంది.
గతేడాది శాకినీ డాకినీ అంటూ నివేదా థామస్‌తో కలిసి వచ్చిన రెజీనా ఈ ఏడాది కూడా కాజల్ అగర్వాల్‌తో కలిసి కార్తీక అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో అలరించింది. ఇక తమిళంలో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సూర్పనగై’ సినిమా ఆ మధ్య థియేటర్లలో రిలీజ్ అయి చప్పుడు లేకుండానే వెళ్ళిపోయింది. తెలుగులో నేనేనా పేరుతో రిలీజ్ అయిన ఈ పీరియాడికల్ ఫాంటసీ థ్రిల్లర్ సరైన బజ్, ప్రమోషన్లు లేకపోవడంతో అలా చప్పుడు లేకుండా వెళ్లిపోవలసి వచ్చింది.
ఇక ఇప్పుడు కూడా సైలెంటుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే మొదటి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రస్తుతం నేనేనా సినిమా స్ట్రీమింగ్ అవుతూ ఉండడం గమనార్హం. నేనేనా సినిమాకు కార్తిక్ రాజు దర్శకత్వం వహించగా రెజీనాతో పాటు వెన్నెల కిశోర్, అక్షర గౌడ, జయప్రకాష్, తాగుబోతు రమేష్, జీవా రవి, మైఖేల్, కౌషిక్ తదితరలు కీలక పాత్రలలో నటించారు. ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాజశేఖర వర్మ నేనేనా సినిమాను నిర్మించగా సీఎస్ శ్యామ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో యువరాణిగా, ఆర్కియాలజిస్టుగా డ్యూయల్ రోల్‌లో కనిపించిన రెజీనా సినిమాను థియేటర్లలో మిస్ అయితే ఆహాలో చూసేయండి మరి.