CINEMA

నటుడు చంద్రమోహన్ కన్నుమూత..

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్.. కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. హీరోగా 175 సినిమాల్లో నటించారు.

 

ఐరన్ లెగ్ గా పేరొందిన హీరోయిన్స్ చంద్రమోహన్ తో నటిస్తే.. సూపర్ స్టార్స్ అవుతారని అప్పట్లో సెంటిమెంట్ ఉండేది. అందుకే ఆయన్ను లక్కీస్టార్ అని పిలిచేవారు. చంద్రమోహన్ 2 ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. పదహారేళ్ల వయసు, సిరిసిరి మువ్వ సినిమాలో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. హీరోగానే కాదు.. తండ్రిగా, సోదరుడిగా కూడా చంద్రమోహన్ నటించారనే కంటే జీవించారని చెప్పాలి. సైడ్ క్యారెక్టర్ చేసినా.. తనదైన కామెడీ టైమింగ్ మిస్సయ్యేవారు కాదు.

 

బాపట్ల వ్యవసాయ కళాశాలలో చంద్రమోహన్ డిగ్రీ పూర్తి చేశారు. 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ కమెడియన్‌గా నంది అవార్డు అందుకున్నారు. 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు. ఆత్మీయులు, జీవనతరంగాలు, అల్లూరి సీతారామరాజు, ఓ సీత కథ, ఇంటింటి రామాయణం, కాంచనగంగా, చంటబ్బాయ్, గీతాంజలి, అల్లుడుగారు, ఆదిత్య 369, పెద్దరికం, నిన్నే పెళ్లాడతా, ప్రేమించుకుందాం రా, చంద్రలేఖ……ఇలా అనేక సినిమాలు చేశారు. చిన్న చిన్న హీరోల నుంచి అగ్రహీరోలందరితోనూ నటించారు. కె.విశ్వనాథ్ కు చంద్రమోహన్ వరుసగా సోదరుడు అవుతారు. కాగా.. నవంబర్ 13న చంద్రమోహన్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.