ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులను పంపించకుండా తనను మోసం చేశారంటూ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ముందే చెల్లించినా తాను ఆర్డర్ చేసిన దుస్తులను ఇప్పటి వరకూ పంపలేదని మండిపడ్డారు. ఈమేరకు యాంకర్ తాజాగా ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
అనసూయ ఇన్ స్టా పోస్ట్ ప్రకారం.. దాదాపు నెల రోజుల క్రితం ట్రపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్ సైట్ లో కొన్ని దుస్తులకు అనసూయ ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టింది. ఆ దుస్తులకు సంబంధించిన మొత్తాన్ని ముందే చెల్లించింది. అయితే, నెల రోజులు గడిచినా తను ఆర్డర్ పెట్టిన దుస్తులు రాలేదని, ఈ విషయంపై సదరు వెబ్ సైట్ నిర్వాహకులను సంప్రదించినా స్పందన లేదని ఆరోపించింది. అటు ఆర్డర్ పెట్టిన దుస్తులు పంపించకుండా, ఇటు తను చెల్లించిన డబ్బులు రీఫండ్ చేయకుండా మోసం చేశారని అనసూయ చెప్పింది.
సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి డబ్బులు కాజేస్తున్నారని ట్రపుల్ ఇండియా వెబ్ సైట్ నిర్వాహకులపై మండిపడింది. ఈ విషయంపై తాను స్పందించకూడదని అనుకున్నానని.. కానీ మిగతా వారు తనలాగా మోసపోవద్దని చెప్పేందుకే ఈ పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అనసూయ రెండు తమిళ సినిమాలు చేస్తుంది. అలాగే తెలుగులో పలు రియాల్టీ షోలలో పాల్గొంటూ బిజిబిజీగా ఉంది. తెలుగులో చివరగా పుష్ప 2 చిత్రంలో కనిపించింది.