పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా నుంచి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 21వ తేదీన ఉదయం 10:08 గంటలకు ‘ఓజీ’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానుల సందడి మొదలైంది. “అభిమానులకు అసలైన విందును అందించేందుకు ఓజీ సిద్ధమవుతున్నాడు” అంటూ చిత్ర యూనిట్ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ ప్రకటనతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
‘సాహో’ వంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత దర్శకుడు సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ‘ఓజీ’పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్‌ను మునుపెన్నడూ చూడని గ్యాంగ్‌స్టర్ అవతారంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ నటుడు అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 21న రాబోయే ట్రైలర్‌తో సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో ఒక స్పష్టత వస్తుందని, పవన్ కల్యాణ్ మాస్ అవతార్‌ను చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓజీ’ చిత్రం సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.