ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ సినీ అవార్డుల ఎంపిక ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు అన్నింట్లోనూ లాబీయింగ్ జరుగుతుందని, దీనికి ఏ పురస్కారాలూ మినహాయింపు కావని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జాతీయ అవార్డుల విషయంలో లాబీయింగ్ ఎక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అవార్డుల కోసం చిత్రబృందాలు తమ నెట్వర్క్ను ఉపయోగించుకుంటాయని, కొన్ని పార్టీల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తాయని పరేశ్ రావల్ తెలిపారు. “కొంతమంది నిర్మాతలు జ్యూరీ సభ్యులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఒక్కోసారి, ‘ఇది ఫలానా పెద్ద దర్శకుడి సినిమా’ అనే కారణంతో కూడా అవార్డుల కమిటీ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ఆస్కార్ అవార్డుల్లోనూ పైరవీలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
తనకు వ్యక్తిగతంగా అవార్డులు, ట్రోఫీల కన్నా నటనకు లభించే గుర్తింపే ముఖ్యమని పరేశ్ రావల్ అన్నారు. “నా నటన బాగుందని దర్శకనిర్మాతలు ప్రశంసిస్తే కలిగే ఆనందం ముందు అవార్డులు దిగదుడుపే. ఆ ప్రశంసలే నాకు అత్యంత విలువైనవి” అని ఆయన స్పష్టం చేశారు. కాగా, పరేశ్ రావల్ 1994లో ‘వో ఛోకరీ’, ‘సర్’ చిత్రాల్లోని నటనకు గాను జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు.

