CINEMA

టీటీడీ షాక్: శ్రీవారి ప్రసాదంపై వ్యాఖ్యల కారణంగా యాంకర్ శివ జ్యోతి ఆధార్ బ్లాక్?

యాంకర్ శివ జ్యోతి తమ్ముడు ఇటీవల తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, ధరపై చేసిన వ్యాఖ్యల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆమెపై సంచలన చర్యలు తీసుకుందని సమాచారం. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఫిర్యాదులు టీటీడీకి అందాయి.

ఫిర్యాదులపై స్పందించిన టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ ఘటనపై విచారణ చేపట్టింది. అనంతరం సమావేశమైన టీటీడీ బోర్డు, శివ జ్యోతికి బిగ్ షాక్ ఇస్తూ, భవిష్యత్‌లో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ఆమె ఆధార్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయంతో శివ జ్యోతి టీటీడీకి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్లు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే, వివాదం ముదురుతుండటంతో శివ జ్యోతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మా తమ్ముడి వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే, క్షమించండి. మా కుటుంబ సభ్యులు ఎప్పటికీ శ్రీవారి భక్తులే” అని పేర్కొంటూ ఆమె క్షమాపణలు చెప్పారు. అయినా, టీటీడీ క్షమించకుండా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.