CINEMA

దేవుడితో గొడవపడేదాన్ని: నటి భాగ్యశ్రీ భోర్సే ఆసక్తికర వ్యాఖ్యలు

యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే తన వ్యక్తిగత విశ్వాసాలు మరియు దైవచింతన గురించి అభిమానులతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. శుక్రవారం నాడు ఒక ఆలయ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, చిన్నప్పుడు జీవితంలో కష్టం వస్తే దేవుడినే తన తండ్రిగా భావించి పోట్లాడేదాన్నని తెలిపారు. అయితే, ఇప్పుడు తాను ఒక దశకు చేరుకున్నానని, తనకు ఏది మంచిదో దేవుడికి ఖచ్చితంగా తెలుసని నమ్ముతున్నానని వెల్లడించారు.

కెరీర్ పరంగా మంచి విజయాలు అందుకుంటున్న ఈ నేపథ్యంలో, భాగ్యశ్రీ తన విజయంపై స్పందిస్తూ, కష్టపడితే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఆమె నటించిన ‘కాంత’ చిత్రంలో ఆమె పోషించిన ‘కుమారి’ పాత్రకు విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంలో నటనకు కూడా ప్రశంసలు దక్కాయి.

ఈ సందర్భంగా, భాగ్యశ్రీ తన సినీ ప్రయాణంలో సహకరించిన ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నటుడు రానా దగ్గుబాటిని తన గురువుగా అభివర్ణించారు. మొదటి రోజు నుంచి తనకు మద్దతుగా నిలిచిన రానా నిజమైన స్నేహితుడు, మంచి వ్యక్తి అని, ఆయన మార్గదర్శకత్వం లేకపోతే తాను ఈ స్థానానికి రాలేకపోయేదాన్నని పేర్కొన్నారు. అలాగే, తన సహనటుడు దుల్కర్ సల్మాన్‌ను ‘నడిప్పు చక్రవర్తి’ అని ప్రశంసిస్తూ, ఆయన పక్కన నటించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని, నటుడిగా ఆయన అందరికీ స్ఫూర్తి అని భాగ్యశ్రీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.