CINEMA

ఓటీటీలో సందడికి సిద్ధమైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ – డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్

నవంబర్ 21న చిన్న సినిమాగా విడుదలై, థియేటర్ల నుంచి మంచి విజయాన్ని అందుకున్న గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా ఈ నెల 19వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ కానుంది. సురేశ్ బొబ్బిలి అందించిన పాపులర్ బాణీలు, మంచి ఓపెనింగ్స్‌కు తోడై, ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన సినిమాల జాబితాలో చేరింది.

ఈ చిత్రంలో అఖిల్ రాజ్ మరియు కొత్త నాయిక తేజస్వీ రావు ప్రధాన పాత్రలను పోషించారు. తేజస్వీ రావు తన నవ్వు, నటనతో యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసి, చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇది లవ్ స్టోరీ కావడంతో యువత థియేటర్స్‌లో సందడి చేసి సినిమాను విజయవంతం చేశారు. సినిమా విజయంలో ముఖ్యంగా కథానాయిక నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

దర్శకుడు సాయిలు తెరకెక్కించిన ఈ సినిమా కథ విషయానికి వస్తే, పేదింటి కుర్రాడు రాజు, అదే గ్రామానికి చెందిన రాంబాయిని ప్రేమిస్తాడు. అయితే, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న యువకుడితోనే తన కూతురి పెళ్లి జరిపించాలని ఆమె తండ్రి పట్టుదలగా ఉంటాడు. ఈ అడ్డంకిని అధిగమించడానికి, రాంబాయిని గర్భవతిని చేస్తే తనతోనే పెళ్లి జరిపిస్తారని భావించిన రాజు, అలాగే చేస్తాడు. ఈ చర్య తరువాత చోటుచేసుకునే పరిణామాల చుట్టూ కథ నడుస్తుంది.