సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ తన పుట్టినరోజును ‘మూన్‌వాక్’ చిత్ర బృందంతో కలిసి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలో రెహమాన్ స్వయంగా ఐదు పాటలను లైవ్‌లో పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా, ఈ చిత్రంతో ఆయన నటుడిగా కూడా అరంగేట్రం చేస్తుండటం విశేషం. ఈ వేడుకలో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఆయన బర్త్‌డే కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ప్రభుదేవా డ్యాన్స్ ట్రిబ్యూట్. ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’గా పిలవబడే ప్రభుదేవా, రెహమాన్ గౌరవార్థం సుమారు 10 నిమిషాల పాటు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అనంతరం రెహమాన్‌ను స్టేజ్‌పైకి ఆహ్వానించి, ఆయనతో కలిసి ఐకానిక్ ‘ముక్కాలా’ పాటకు స్టెప్పులేయించడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ యోగిబాబు 16 విభిన్న పాత్రల్లో నటిస్తుండటం మరో విశేషం. మనోజ్ ఎన్ఎస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అజు వర్గీస్, అర్జున్ అశోకన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాఘవ లారెన్స్ వంటి ప్రముఖులు అతిథులుగా హాజరైన ఈ చిత్రం ఈ ఏడాది మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

