CINEMA

రాజకీయాల్లోకి రాను.. మూగజీవుల హత్యలపై మౌనం వహించను: రేణు దేశాయ్

హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో యాంకర్ రష్మీతో కలిసి నిర్వహించిన సమావేశంలో రేణు దేశాయ్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆమె కరాఖండిగా చెప్పారు. కేవలం సామాజిక బాధ్యత గల పౌరురాలిగా, జంతు ప్రేమికురాలిగా మాత్రమే తాను సమస్యలపై స్పందిస్తున్నానని వివరించారు. పదవుల కోసం కాకుండా, మూగజీవుల రక్షణే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

వీధి కుక్కల పట్ల జరుగుతున్న క్రూరత్వాన్ని రేణు దేశాయ్ తీవ్రంగా ఖండించారు. ఒక కుక్క కరిస్తే వందల సంఖ్యలో కుక్కలను సామూహికంగా చంపడం అమానుషమని ఆమె మండిపడ్డారు. “ఒక్క మగాడు అత్యాచారానికి పాల్పడితే.. అందరు మగవాళ్లను రేపిస్టులుగా ముద్రవేసి శిక్షిస్తామా?” అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. సమాజంలో పిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు మౌనంగా ఉండే వ్యవస్థలు, కుక్కల విషయంలో మాత్రం ఇంత క్రూరంగా ప్రవర్తించడం సరికాదని నిలదీశారు.

వీధి కుక్కల సమస్యకు అపరిశుభ్ర వాతావరణమే ప్రధాన కారణమని, దీనిపై దృష్టి సారించకుండా ప్రాణాలను తీయడం తగదని ఆమె అన్నారు. నిత్యం వాహనాల కింద పడి గాయపడే కుక్కలు ఎవరికి ఫిర్యాదు చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటల వల్ల తనపై విమర్శలు వచ్చినా భయపడబోనని, మూగజీవుల కోసం ప్రత్యేక షెల్టర్లు, వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తన ప్రసంగం ద్వారా కనీసం ఒక్కరిలోనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె ముగించారు.