CINEMA

8 ఏళ్లు భరించా, ఇక సహించను: సోషల్ మీడియా ట్రోలర్లకు రష్మిక మందన్న ఘాటు హెచ్చరిక

తన వ్యక్తిగత విషయాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై నటి రష్మిక మందన్న తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ఎనిమిదేళ్ల క్రితం తన తల్లి సుమన్ మందన్న ఒక కన్నడ ఛానల్‌కు ఇచ్చిన పాత ఆడియో క్లిప్‌ను ఇప్పుడు కావాలనే వైరల్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా తనపై వస్తున్న విమర్శలను ఓపికగా భరించానని, అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగడం సహించబోనని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఘాటు లేఖను విడుదల చేశారు.

వైరల్ అవుతున్న ఆ ఆడియోలో రష్మికకు గతంలో నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థం, ఆ తర్వాత తలెత్తిన విభేదాల గురించి ప్రస్తావన ఉంది. రష్మిక కెరీర్ ఆరంభంలో ‘గీత గోవిందం’ వంటి సినిమాల సమయంలో పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలని ఒత్తిడి తెచ్చారని, ఆ ఆంక్షల వల్లే సమస్యలు మొదలయ్యాయని ఆమె తల్లి ఆ ఆడియోలో వెల్లడించారు. ఈ పాత విషయాలను మళ్లీ వెలికితీసి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రచారం చేయడంపై రష్మిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై స్పందిస్తూ రష్మిక 24 గంటల అల్టిమేటం జారీ చేశారు. తన తల్లికి సంబంధించిన ఆడియో క్లిప్‌లను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా వాటిని తొలగించకపోతే, సంబంధిత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మరియు మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.