CINEMA

తమిళ్ తెలుగు వార్ మధ్యలో నలిగిపోతున్న దిల్రాజు

తమిళ స్టార్ విజయ్ హీరోగా, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు సినిమా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ల మధ్య వివాదానికి కారణమయ్యింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ తమిళ‍ంలో వరిసు పేరుతో వస్తోంది. ఇది తమిళంలో స్ట్రెయిట్ మూవీకాగా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి.

ఈ సినిమాలతో పాటు దిల్ రాజు ‘వారసుడు’ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించనున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. తెలుగు సినీ నిర్మాతల మండలి అధికారికంగా స్పందించింది. గతంలో దిల్ రాజు చెప్పిన మాటలు. ఇప్పుడు కూడా అమలు చేయాలని కోరారు. సంక్రాంతి, దసరా వంటి పండుగలకు విడుదలయ్యే సినిమాల విషయంలో, ముందు స్ట్రెయిట్ చిత్రాలకు థియేటర్లు కేటాయించాలని, ఆ తర్వాతే డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఇవ్వాలని నిర్మాతల మండలి అభ్యర్థించింది.

దీనిపై ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి వచ్చిన ఈ అధికారిక ప్రకటన ఇప్పుడు తమిళ దర్శకుల ఆగ్రహానికి కారణమవుతోంది. మా సినిమాలకు థియేటర్లు ఇవ్వకుంటే.. మీ సినిమాలకు కూడా ఇవ్వం.. అంటూ కొందరు కోలీవుడ్ దర్శకులు మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రకటిస్తున్నారు.. ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇక్కడ (కోలీవుడ్) తెలుగు సినిమాలను మేము ఆదరిస్తున్నప్పుడు మీరు మాత్రం తమిళ సినిమాలను ఎందుకు ఆపాలి? అని తమిళ సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో వైపు ఈ అంశంపై నిర్మాత అల్లు అరవింద్ వ్యాఖ్యలు తెలుగు నిర్మాతల మండలికి షాక్ కలిగించాయి. నిర్మాతల మండలి నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక డబ్బింగ్ సినిమాలను ఆపడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.