ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్ ప్రమాదంలో పడింది. ఏకంగా పట్టణమే (Sinking of Joshimath) కుంగిపోతోంది. వందలాది ఇళ్లకు ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. క్రమంగా రోడ్లపై కూడా పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలో అక్కడి ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జోషిమఠ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం.. ఆదివారం కీలకమైన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా (PK Mishra) నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. జోషిమఠ్‍లో చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై ఉన్నతాధికారులు, నిపుణులతో జోషి చర్చించారు. నిపుణుల కమిటీ నియామకం Joshimath Sinking: జోషిమఠ్ పరిస్థితిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, పట్టణాన్ని కాపాడేందుకు సిఫారసులు ఇచ్చేందుకు ఓ నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఏడు విభిన్నమైన ఆర్గనైజేషన్ల నిపుణులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‍మెంట్ అథారిటీ(NDMA), నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‍మెంట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటీ రూర్కీ, వాడియా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ జువాలజీ, నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్ ప్రతినిధులతో కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. జోషిమఠ్‍పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Joshimath Sinking: జోషిమఠ్‍లో ప్రస్తుత పరిస్థితిని ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు.. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) నుంచి ఓ టీమ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF)కు చెందిన నాలుగు బృందాలు జోషిమఠ్‍లో ఉన్నాయని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, హేమ్‍కుంద్ సాహిబ్‍లకు జోషిమఠ్ గేట్‍వేగా ఉంది. ఇక్కడి నుంచి బద్రీనాథ్ యాత్ర మొదలువుతుంది. హిమాలయాల ట్రెక్కింగ్ కోసం కూడా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. జోషిమఠ్ పట్టణంలో సుమారు 600 ఇళ్లకు ఇప్పటి వరకు పగుళ్లు వచ్చాయని తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం పర్యటించారు. ఆ నాలుగు లైన్ల హైవే వల్లే.. నాలుగు లేన్ల హైవే నిర్మాణం.. జోషిమఠ్‍పై తీవ్ర ప్రభావం చూపిందని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) సైంటిస్ట్ డీఎం బెనర్జీ చెప్పారు. ఈ హైవే నిర్మాణం వల్ల జోషిమఠ్ వ్యవస్థ బలహీనపడిందని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో ఆయన అన్నారు. “జోషిమఠ్ హిమాలయాల్లో భాగం. భూకంప ప్రభావిత జోన్-4లో ఉంది. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలే చేయకూడదు. ముఖ్యంగా 3-4 అంతస్తులంత పెద్ద ఇళ్లు అసలు నిర్మించకూడదు” అని అన్నారు. బలహీనమైన భూగర్భం ఉండడమే జోషిమఠ్‍కు ప్రతికూలతగా ఉందని చెప్పారు. “ఎంతో ప్రమాదకరంగా మారిన హైవే నిర్మాణాన్ని మనం ఆపొచ్చు. సొరంగాల నిర్మాణాలను కూడా నిలిపివేయాలి. ఇది పెళుసుగా ఉండే జోన్. ఇక్కడ సొరంగాలను నిర్మించినా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ కూలిపోకపోయినా.. భూగర్భ జలం ఉబికి వస్తుంది. దీనివల్ల బలహీనపడతాయి” అని ఆయన చెప్పారు.