National

మరోసారి రసవత్తరంగా మహారాష్ట్ర రాజకీయాలు

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 రోజుల్లోగా కుప్పకూలుతుందని శివసేన (యూబీటీ – ఉద్ధవ్ వర్గం) కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు.

షిండే సర్కార్‌కు మరణ శాసనం రానుందని జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సంజయ్ అత్యంత సన్నిహితుడు. కొన్ని పిటిషిన్లపై సుప్రీం కోర్టు నుంచి తీర్పు రావాల్సి ఉండగా.. సంజయ్ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

Maharashtra Politics: ఉద్ధవ్ థాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం దాఖలు చేసిన పిటిషన్ సహా మరిన్నింటిపై తీర్పు రానుందని, వాటి పట్ల ఆశాభావంగా ఉన్నట్టు సంజయ్ రౌత్ చెప్పారు. కోర్టు తీర్పు కోసం తమ పార్టీ వేచిచూస్తోందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Maharashtra Politics: “ముఖ్యమంత్రి, 40 ఎమ్మెల్యేల ప్రభుత్వం 15-20 రోజుల్లో కూలిపోతుంది. ఈ ప్రభుత్వానికి మరణ శాసనం జారీ అయింది. అయితే, దానిపై ఎవరు సంతకం పెడతారనేది నిర్ణయం కావాల్సి ఉంది” అని సంజయ్ రౌత్ అన్నారు. కాగా, షిండే ప్రభుత్వం ఫిబ్రవరిలోనే కూలిపోతుందని శివసేన (యూబీటీ) గతంలో ఓసారి చెప్పింది. ఇప్పుడు మళ్లీ అదే వ్యాఖ్యలు చేస్తోంది.

Maharashtra Politics: గతేడాది జూన్‍లో ఏక్‍నాథ్ షిండే సహా 39 మంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వెళ్లి, తిరుగుబాటు చేశారు. దీంతో శివసేన – కాంగ్రెస్ – ఎన్‍సీపీతో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏక్‍నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

శివసేన పార్టీని, ఆ పార్టీ గుర్తును ఎన్నికల సంఘం ఏక్‍నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. కాగా, చాలా పరిణామాలపై ఉద్ధవ్ థాక్రే, ఏక్‍నాథ్ షిండే వర్గాలు సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లను వేశాయి. సుప్రీం కోర్టు వీటిపై విచారణ జరిపింది. కొన్ని పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది. త్వరలో కొన్ని తుది తీర్పులు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Maharashtra Politics: మరోవైపు, ఎన్‍సీపీ కీలక నేత అజిత్ పవార్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరతారన్న వాదనలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, తాను బీజేపీలోకి వెళ్లడం లేదని అజిత్ పవార్ స్పష్టం చేశారు. కానీ, ఇప్పటికిప్పుడు సీఎం పదవిని ఆశించే పరిస్థితిలో ఎన్‍సీపీ ఉందని వ్యాఖ్యలు చేశారు.