National

నిరుద్యోగులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. పదో తరగతి అర్హతతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం మసాజ్ థెరపిస్ట్(Massage Therapist) పోస్టుల భర్తీ కోసం SAI అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వచ్చే నెల జూన్ 11లోపు ఇందుకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలు, ఎంపిక ప్రక్రియ, జీతభత్యాలు వంటి వివరాలు పరిశీలిద్దాం.

ఖాళీల వివరాలు

మసాజ్ థెరపిస్ట్-9 పోస్టులు

అర్హత ప్రమాణాలు

అభ్యర్థుల వయసు జూన్ 11, 2023 నాటికి 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. ప్రస్తుతం SAIలో పనిచేస్తున్న సిబ్బంది అప్లై చేసుకుంటే, వయోపరిమితిలో వారికి రెండేళ్ల సండలింపు ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తిచేసి ఉండాలి. అలాగే మసాజ్ థెరపీలో సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. క్రీడా రంగంలో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ ఫార్మాట్‌లో 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఎగ్జామ్ స్కోర్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్

అర్హులైన అభ్యర్థులు ముందుగా SAI అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి, SAI మసాజ్ థెరపిస్ట్ నోటిఫికేషన్-2023 అనే లింక్‌పై క్లిక్ చేయాలి. అన్ని వివరాలను పరిశీలించి, అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. SAI అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థులు అప్లికేషన్ నింపాలి. దీన్ని.. ‘ది ప్రిన్సిపాల్, లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కార్యవట్టం P.O, తిరువనంతపురం-695581, కేరళ’ అనే అడ్రస్‌కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

పనితీరు ఆధారంగా సర్వీస్ పొడిగింపు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ విధానంలో మసాజ్ థెరపిస్ట్ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. ఎంపికయ్యే అభ్యర్థులు నెలకు రూ.35వేల జీతంతో సంవత్సరం పాటు SAIకు చెందిన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీలో సర్వీస్ అందించాల్సి ఉంటుంది. పనితీరు ఆధారంగా వార్షిక ఇంక్రిమెంట్ 10 శాతం వరకు, అలాగే అదనంగా ఒక సంవత్సరం నుంచి గరిష్టంగా 8 సంవత్సరాల వరకు సర్వీస్‌ను పొడిగించే అవకాశం కూడా ఉంది