భారతీయుల ఆహారపు అలవాట్లను కరోనా పూర్తిగా మార్చేసింది. కరోనాకు ముందు చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌పై మక్కువ చూపిన వారు ఇప్పుడు సహజంగా పండించిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు.
దేశంలో ‘క్లీన్ ఫుడ్'(పరిశుభ్రమైన ఆహారం)పై ప్రజలకు అవగాహన పెరిగిపోయింది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాల్సిందేనని నిశ్చయానికి వస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా రానున్న కాలంలో క్లీన్ ఫుడ్ ఇండస్ట్రీ(Clean food industry) ఓ వెలుగు వెలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలో ప్రస్తుతం ఎక్కడైనా ప్రాసెస్ చేసిన ఆహారం విరివిగా దొరుకుతుంది. కానీ, వీటిలో పూర్తి స్థాయిలో పోషకాలు ఉండకపోవచ్చు. సహజంగా లభించే వాటితో పోలిస్తే ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండబోదు. కానీ, క్లీన్ ఫుడ్ పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎలాంటి హానికర రసాయనాలు వాడకుండా, పెస్టిసైడ్స్ ఉపయోగించకుండా వీటిని పండిస్తారు. అనంతరం ఫుడ్ ప్రొడక్టులను తయారు చేసి నేరుగా కస్టమర్‌కే విక్రయిస్తారు.
సహజ సిద్ధంగా లభించిన ఆహారం కాబట్టి ఇవి తీసుకుంటే పుష్కలంగా పోషకాలు అందుతాయి. పైగా గుండె, మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ మరింత చురుకుగా పనిచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో క్లీన్ ఫుడ్‌పై ప్రజలకు ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ క్లీన్ ఫుడ్ ఇండస్ట్రీపై ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఫోకస్ పెడుతున్నారు.
Tobacco Effect: సిగరెట్ తాగితే లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
* నగరాల్లో ఎక్కువ
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ క్లీన్ ఫుడ్‌పై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం విస్తృతమైనందున ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఈ ట్రెండ్ వ్యాపిస్తోంది. మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ క్లీన్ ఫుడ్‌కు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఈ రంగంలో పెట్టుబడులు పెరిగిపోయాయి. రానున్న కాలంలో ఇద మరింత పుంజుకుంటుందని youcarelifestyle.com కో ఫౌండర్ నరేంద్ర ఫిరోదియా అభిప్రాయం వ్యక్తం చేశారు. క్లీన్ ఫుడ్‌తో శరీరంలోని కాలేయం, పేగులపై భారం తగ్గుతుందని నరేంద్ర వెల్లడించారు. దీంతో ఇతర శరీర భాగాలు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేసే ఆస్కారం ఉంటుందని తెలిపారు. క్లీన్ ఫుడ్ ఇండస్ట్రీ వృద్ధి సాధించడానికి ఈ కామర్స్ ఇండస్ట్రీ విస్తరణే కారణమన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు నుంచే కస్టమర్లు కొనుగోలు చేసే వీలు కలిగిందని చెప్పారు. బియ్యం, గోధుమలే కాకుండా చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలపై కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.