National

Jawaharlal Nehru : నెహ్రూ జీవించిన ఇంటి పేరే మార్చేశారు- కేంద్రం షాకింగ్ నిర్ణయం…

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకాల్ని తుడిచేసేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇవాళ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న తీన్ మూర్తి భవన్ ప్రాంగణం పేరును మారుస్తూ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. ద నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా ఉన్న ఈ ప్రాంగణం పేరును ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా పేరు మార్చింది.

గతంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా ఉన్న తీన్ మూర్తి భవన్ ప్రాంగణానికి పేరు మార్చడంతో ఇది కాస్తా ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా మారిపోయింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా పనిచేసింది.నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (ఎన్‌ఎంఎంఎల్) ప్రత్యేక సమావేశంలో దాని పేరును మార్చాలని నిర్ణయించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ సొసైటీ ఉపాధ్యకుడిగా వ్యవహరిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశంలో తన ప్రసంగంలో రాజ్ నాథ్ సింగ్ ఈ పేరు మార్పు ప్రతిపాదనను స్వాగతించారు. దీనికి గల కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు. సంస్థ తన కొత్త రూపంలో జవహర్‌లాల్ నెహ్రూ నుండి నరేంద్ర మోడీ వరకు ప్రధాన మంత్రులందరి సహకారాన్ని తీసుకుందని, వివిధ సవాళ్లకు వారి ప్రతిస్పందనలకు సాక్షిగా నిలిచిందన్నారు.

ప్రధానమంత్రులను ఒక సంస్థగా అభివర్ణిస్తూ, వివిధ ప్రధాన మంత్రుల ప్రయాణాన్ని ఇంద్రధనస్సు యొక్క వివిధ రంగులతో పోల్చిన రాజ్ నాథ్ సింగ్.. ఇంద్రధనస్సును అందంగా మార్చడానికి అన్ని రంగులు దామాషా ప్రకారం ప్రాతినిధ్యం వహించాలని తెలిపారు. అందువలన, తాజా తీర్మానం మన మాజీ ప్రధాన మంత్రులందరికీ గౌరవ సూచికంగా రాజ్ నాథ్ అభివర్ణించారు. అయితే ఎన్‌ఎంఎంఎల్‌ పేరు మార్పను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ తప్పుబట్టారు.