National

పీఎస్‍యూలో 2 లక్షల ఉద్యోగాలు మాయం చేశారు.. రాహుల్ ఆరోపణ..

ప్రభుత్వ రంగ సంస్థల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు తొలగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పెట్టుబడిదారుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ఆరోపించారు.

బడా వ్యాపారుల ప్రయోజనం కోసం లక్షలాది మంది యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు. ఒకప్పడు ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) భారతదేశానికి గర్వకారణంగా ఉండేవని చెప్పారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు.

“దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండావి. అవి 2022 నాటికి 14.6 లక్షలకు తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగాలు తగ్గుతాయా? BSNLలో 1,81,127 ఉద్యోగాలు పోయాయి. సెయిల్‌లో 61,928. ఎంఎన్టీఎల్ లో 34,997, SECLలో 29,140, FCIలో 28,063, ONGCలో 21,120 ఉద్యోగాలు పోయాయి” అని హిందీలో ట్వీట్‌లో చేశారు.

ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసిన వారు, ఉద్యోగాలను పెంచే బదులు, రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను “తొలగించారని” ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్‌లను దాదాపు రెట్టింపు చేసిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల పెంపుదల రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కును హరించివేయడం కాదా? ఈ కంపెనీలను ప్రైవేటీకరించడానికి ఇది కుట్ర కాదా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.