National

జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల భేటీ-పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనంలోకి..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈసారి వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించాల్సిన కీలక బిల్లులపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన కేంద్రం..

ఈ నెల 20న సమావేశాల ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈసారి సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. పార్లమెంటు పాత భవనంలోనే ప్రారంభం కాబోతున్న ఈ సమావేశాలు మధ్యలో కొత్త భవనానికి మారబోతున్నాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇవాళ ప్రకటించారు. ఈ సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమైనప్పటికీ, మధ్యలోనే కొత్త పార్లమెంట్ భవనానికి మారే అవకాశం ఉందని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే కొత్త పార్లమెంట్ భవనంలో ఇదే తొలి సెషన్ కానుంది. ఈసారి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రహ్లాద్ జోషీ కోరారు.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలు మరింత హాట్ గా కొనసాగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి మోడీ యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం ఈ కసరత్తును పార్లమెంట్ వేదికగా వేగవంతం చేయబోతోంది.

ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం 23 రోజుల పాటు సాగుతాయని, 17 సిట్టింగ్‌లు ఉంటాయని మంత్రి ప్రహ్లాద్ జోషీ ట్విట్టర్ లో తెలిపారు. ఈ సెషన్‌లోనే ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) ఆర్డినెన్స్ స్థానంలో ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంది. దీన్ని ఇప్పటికే విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సమావేశాలు సజావుగా సాగడం కష్టంగానే కనిపిస్తోంది.