National

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు

ఉత్తర భారతంలో తెంపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ వాతావరణశాఖ ప్రకటించింది.

మెరుపు వరదలు, కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు నీట మునిగాయి. వీటిల్లో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌లో భారీవర్షానికి ఓ ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు.

దేశ రాజధాని ఢిల్లీలో గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో రాజధానిలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో కురవాల్సిన మొత్తం వర్షంలో ఇది 15 శాతానికి సమానమని వాతావరణశాఖ తెలిపింది. 1982 జులైలో ఈ స్థాయి వర్షాలు కురిశాయి. ఆదివారం కూడా ఢిల్లీలో వర్షాల జోరు కొనసాగనుంది. దేశ రాజధానిలోని ఓ ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలి 58 సంవత్సరాల స్త్రీ ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షాల వల్ల అత్యవసర సేవల విభాగాల్లో వారాంతపు సెలవులను రద్దు చేశారు.

రాజస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని తొమ్మిది జల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. జమ్మూలోని రెండు జిల్లాల్లో వరదల ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కతువా, సాంబ జిల్లాల్లో మూడో రోజు కూడా వర్షాలు కురుస్తుండటంతో నదీపరీవాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వం అప్రమత్తమై అధికారులను మొహరింపచేసింది. ఏదైనా విపత్తు సంభవిస్తే ఆదుకోవడానికి దళాలను కూడా సిద్ధం చేసింది.