National

ఇంటర్వ్యూను బహిష్కరించిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

ఎవరైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదా ఉద్యోగం కొరకు వెళ్ళినప్పుడు ఎంతో ఒద్దికగా ఉంటారు. మరీ ముఖ్యంగా బాస్ ముందు ఏ ఉద్యోగి అయినా ఒద్దికగా, అలర్ట్‌గా ఉంటాడు.
బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టు నడుచుకుంటాడు. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అభ్యర్థుల వినయవిధేయతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం కాస్త డిఫరెంట్. ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లిన అతడు, బాస్ ఓ పదిహేను నిమిషాలు లేటుగా వచ్చాడని ఇంటర్వ్యూను బహిష్కరించాడు.

ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు తొలుత మనోడి కాన్ఫిడెన్స్ చూసి తెగ ముచ్చపడిపోయారు. అయితే, అతడు తన నిర్ణయానికి గల అసలు కారణం వివరించడంతో నెట్టింట మరో చర్చ మొదలైంది. తన అనుభవాన్ని వివరిస్తూ మనోడు ఇలా రాసుకొచ్చాడు.

”మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటర్వ్యూ కోసం ఆఫీసులో కాలుపెట్టా. అప్పుడే నాకు డైరెక్టర్‌తో అపాయింట్‌మెంట్ దొరికింది. బాస్ మరో నిమిషంలో వస్తారని రిసెష్షన్‌లో ఉన్న సిబ్బంది చెప్పారు. కానీ, 15 నిమిషాలు గడిచినా ఆయన రాలేదు.

సరిగ్గా 2.45కి నేను నాదారిన బయటకు వచ్చేశా. మళ్లీ వెనక్కు తిరిగి కూడా చూడలేదు. నా రంగంలో ఉన్న పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. నన్ను ఇంత సేపు వేచి చూసేలా చేయాల్సిన పరిస్థితులేం లేవు.

ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే డేంజర్ బెల్స్ వినిపించాయి. నాకు సహనం ఎంత ఉందో పరీక్షించేందుకు ఇలా చేశారు. నాకు ఉద్యోగం అవసరం ఎంత ఉందనేది ఇలా తెలుసుకోవాలనుకున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ చేరితే నాకు ఇబ్బందులు తప్పవు” అంటూ రాసుకొచ్చాడు. కాగా, ఉద్యోగార్థి చర్యతో అనేక మంది ఏకీభవించారు. ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పుడు ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పడం కనీస మర్యాదని అనేక మంది కామెంట్ చేశారు