AP

ప్రతి నెల కొత్త పింఛన్లు అందిస్తాం. ఇదో నిరంతర గా ప్రక్రియ

ప్రతి నెల కొత్త పింఛన్లు అందిస్తాం. ఇదో నిరంతర గా ప్రక్రియ కొనసాగిస్తాం. అధికారంలో వచ్చిన కొత్తలో సీఎం జగన్ చెప్పుకొచ్చిన మాటిది.

కానీ అమలు చేస్తున్నారా అంటే లేదు. దీనిపై తర్వాత మడత పేచీ వేశారు. ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మాట మార్చారు. పోనీ అదైనా అమలు చేస్తున్నారంటే లేదు. జూలై 1న మంజూరు చేయాల్సిన కొత్త పింఛన్లను.. ఆగస్టు సమీపిస్తున్నా ప్రకటించలేని స్థితిలో వైసీపీ సర్కార్ ఉంది. దీంతో రాష్ట్రంలో లక్షన్నర మందికి పైగా దరఖాస్తుదారులు పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

కొత్త పింఛన్ల పంపిణీ పై జగన్ సర్కార్ మొదట్నుంచి చెబుతున్న మాటపై నిలబడలేదు. అధికారం చేపట్టిన మొదట్లో నెలనెలా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కొన్ని నెలల పాటు అమలు చేసి చేతులెత్తేశారు. ఆ తరువాత ఆ గడువును ఆరు నెలలకు పెంచారు. గత ఏడాది జూలైలో ఇవ్వాల్సిన కొత్త పింఛన్లను ఆగస్టులో ప్రకటించారు. గత ఏడాది నవంబర్ నుంచి జూన్ వరకు దాదాపు లక్ష యాభై వేల మందికి పైగా లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి మంజూరు కాలేదు.

అసలు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. చాలామంది పింఛనుకు దరఖాస్తు పెట్టుకుని ఏడు నెలల సమయం దాటిపోతుంది. వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను అడుగుతుంటే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. కొందరు అధికారులు అయితే తమకు సమాచారం లేదని తిప్పి పంపిస్తున్నారు. దీంతో అర్హత సాధించి కూడా పింఛన్లు రాకపోవడంతో ఎక్కువమంది బాధపడుతున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.

అయితే కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడానికి ఆర్థిక లోటే కారణమని తెలుస్తోంది. గత కొంతకాలంగా సీఎం జగన్ బటన్ నొక్కి ప్రారంభించిన పథకాలకు సంబంధించి నిధుల జమ లో ఎడ తెగని జాప్యం జరుగుతోంది. వైయస్సార్ ఆసరా మూడో విడత నిధులు జమ అయ్యేటప్పటికీ దాదాపు 50 రోజుల సమయం పట్టింది. గత నెల 28న ప్రారంభించిన అమ్మ ఒడి నాలుగో విడత సాయం చాలామంది లబ్ధిదారులకు చేరలేదు. ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ల మంజూరు అనేది ఇప్పట్లో తేలే అంశం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి