National

షాబాద్‌ ప్లాట్ల ఇ-వేలం.. డిజప్పాయింట్ చేశాయిగా

హైదరాబాద్ నగర శివార్లల్లో నిర్వహిస్తోన్న భూముల ఇ-వేలంపాటలు తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. మొన్నటి మొన్న కోకాపేట్‌, మోకిలల్లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఇ-వేలంలో ఎకరం కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందాయి.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట్‌ భూముల ధరలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి.

ఈ- ఆక్షన్‌లో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు స్థలాలను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర గరిష్ఠంగా 100 కోట్ల రూపాయలను అందుకుంది. అత్యల్పంగా 67 కోట్ల రూపాయలు పలికింది. కోకాపేట్ భూముల వేలం తరువాత హైదరాబాద్‌ శివార్లలోని మిగిలిన ప్రాంతాల్లోనూ హెచ్ఎండీఏ భూముల వేలం పాటలను చేపట్టింది.

ఇప్పుడు తాజాగా షాబాద్‌ ప్లాట్లను హెచ్‌ఎండీఏ ఇ-వేలం వేసింది. 300 చదరపు గజాల విస్తీర్ణం గల 50 ఓపెన్ ప్లాట్లు ఇ-వేలంలో విక్రయించింది హెచ్ఎండీఏ. వాటిని విక్రయించడం ద్వారా 33.06 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి అందింది. కోకాపేట్, మోకిలతో పోల్చుకుంటే ఈ మొత్తం తక్కువే.

15,000 చదరపు గజాలను ఉదయం, సాయంత్రం రెండు సెషన్లల్లో ఇ-వేలాన్ని నిర్వహించింది. ఉదయం 25 ప్లాట్లు ఇ-వేలానికి ఉంచింది. వాటి పరిమాణం మొత్తంగా 7,500 చదరపు గజాలు. వాటి అప్‌సెట్ ధర 7.50 కోట్ల రూపాయలు. వేలం ఆరంభించిన కొద్దిసేపటికే అవన్నీ అమ్ముడుపోయాయి.

ఉదయం సెషన్‌లో 25 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. వాటిని 16.62 కోట్ల రూపాయలకు బిడ్డర్లు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం సెషన్‌లో మరో 25 ప్లాట్లకు ఇ-వేలం నిర్వహించారు హెచ్ఎండీఏ అధికారులు. వాటి పరిమాణం 7,500 గజాలు. వాటి అప్‌సెట్ ధర 7.50 కోట్ల రూపాయలు. 16.44 కోట్ల రూపాయలకు మొత్తం ప్లాటన్నీ అమ్ముడుపోయాయి.

గరిష్ఠంగా ఒక చదరపు గజం 27,000 రూపాయల ధర పలికింది. కనిష్ఠంగా ఒక చదరపు గజం 18,000 రూపాయలకు విక్రయమైంది. ఒక్కో చదరపు గజం ధర సగటున 22,040 రూపాయలుగా తేలినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. ఇక- రంగారెడ్డి జిల్లాలో గల మిగిలిన ప్రాంతాల్లోనూ ప్లాట్లను వేలం వేయడానికి హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు.