National

కేటీఆర్ వ్యాఖ్యలకు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

తెలంగాణ శాసన సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అమెరికాలో తాను విద్యత్ గురించి ఏం మాట్లాడాను, ఆ వ్యాఖ్యలను ఎలా వక్రీకరిస్తున్నారో శాసనసభలో శ్రీధర్ బాబు వివరణ ఇస్తుంటే మంత్రులు అడ్డుకుంటున్నారనన్నారు రేవంత్ రెడ్డి.

సభలో వాస్తవాలు చెప్పే అవకాశం ఇవ్వనంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండా ఉంటాయా అని రేవంత్ ప్రశ్నించారు.

సీతక్క ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఉంటే సీతక్క లాంటి ఎమ్మెల్యేలు కన్నీరు పెట్టాల్సి వచ్చేది కాదన్నారు. వరదబాధిత ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆరెస్ ఎమ్మెల్యేలు రౌడీల్లా వీధుల్లో తిరుగుతున్నారని, వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందా? మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా? రాష్ట్రంలో మంత్రులు లేరా? అని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

తెలంగాణ పట్ల సీఎంకు మోజు తీరింది : పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి దేవుడి మాన్యాలను కూడా వదలడం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఈసారి మనోహర్ రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేడని అన్నారు. ప్రజల్లో ఉండి ప్రజలకోసం తాము కొట్లాడుతున్నామని, మీకోసం మేముంటామని, తమకోసం ఉండాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. పార్టీ జెండా మోసిన వారిని కాంగ్రెస్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చంద్రశేఖర్ రావు కుటుంబం 10వేల ఎకరాలు కబ్జా చేసిందని, లక్ష కోట్లు వెనకేసుకున్నారని, త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను చంద్రశేఖర్ రావు కుటుంబం దోచుకుందన్నారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖర్ రావు కు తెలంగాణతో రుణం తీరిపోయిందని, తెలంగాణ పట్ల సీఎంకు మోజు తీరిందన్నారు రేవంత్.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది : అందుకే వరద ప్రాంతాల్లో పర్యటించకుండా, మహారాష్ట్ర కు వెళ్ళాడని ఎద్దేవా చేసారు రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రైతులపై లేదని, తెలంగాణ ప్రజల క్షేమం పట్టని చంద్రశేఖర్ రావు అవసరమా అంటూ చంద్రశేఖర్ రావుకు సూటిగా సవాల్ విసిరారు. నిజంగా తెలంగాణను బంగారు తెలంగాణ చేసుంటే.. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలని, గజ్వేల్ నుంచి చంద్రశేఖర్ రావు పోటీ చెయాలని, రాక్షసులందరినీ పుట్టించిన బ్రహ్మరాక్షసుడు చంద్రశేఖర్ రావేనన్నారు రేవంత్. బ్రహ్మరాక్షసుడికి మందు పెట్టి బొంద పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, ధర్మయుద్ధం చేయాల్సిన సమయం వచ్చేసిందన్నారు. ఈ యుద్ధంలో గెలిచేది కాంగ్రెస్సేనని, తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.