National

రెడ్డి.. రెడ్డి ఒకటి బై.. వైసీపీలో అంతే

సాధారణంగా సీనియర్ నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తేవాలని భావిస్తారు. తాము మంచి పొజిషన్లో ఉండేటప్పుడే వారితో రాజకీయ అరంగేట్రం చేయాలని చూస్తారు.

కానీ ఏపీలో అధికార వైసీపీ నాయకులకు మాత్రం ఈ అవకాశం దొరకడం లేదు. తమ వారసులను రాజకీయంలోకి తేవాలన్న సీనియర్ల ప్రయత్నాన్ని సీఎం జగన్ అడ్డుకుంటున్నారు. చేస్తే మీరే పోటీ చేయండి.. లేకుంటే ప్రత్యామ్నాయ నాయకుడిని చూసుకుంటానని తేల్చి చెబుతున్నారు. అయితే ఈ విషయంలో సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులకు మినహాయింపు ఇస్తున్నారు. వైసీపీలో ఇతర సామాజిక వర్గ నేతలకు ఇది మింగుడు పడడం లేదు.

వైసీపీలో ఇప్పుడున్న నాయకుల్లో ఎక్కువ మంది 60 ఏళ్ళు క్రాస్ అయ్యారు. అటువంటి వారంతా తమ వారసులను బరిలో దించాలని చూస్తున్నారు. ఎక్కువమంది మంత్రులు సైతం తప్పుకోవాలని భావిస్తున్నారు. అటువంటి వారంతా జగన్కు ఓ మాట చెబుతున్నారు. కానీ ఆయన సానుకూలంగా స్పందించడం లేదు. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు.. చిత్తూరు నుంచి కడప వరకు దాదాపు 50 మంది సీనియర్లు తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే దీనికి జగన్ నుంచి ఆమోదముద్ర లభించడం లేదు.

అయితే విచిత్రం ఏమిటంటే రెడ్డి సామాజిక వర్గం నాయకులకు మాత్రం ఇట్టే మినహాయింపు లభిస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నాయకులకు ఇట్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చెవిరెడ్డిని తన కోటరీలోకి లాగేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఆర్థిక వనరులను సమకూర్చే పనిని అప్పగించారు. ఆయన కుమారుడికి చంద్రగిరి ఇన్చార్జిగా ప్రకటించేశారు. అంతటితో ఆగకుండా తుడా చైర్మన్ గా కూడా నియమించారు. భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ పీఠం అప్పగించారు. ఆయన కుమారుడికి తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జిగా ప్రకటించారు. ఇప్పటికే ఆయన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నారు. రాయలసీమలో మరికొందరు రెడ్డి సామాజిక వర్గం నాయకులకు ఇట్టే జగన్ అభయమిచ్చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇతర సామాజిక వర్గంలోని నేతలు ఇదేవిధంగా కోరుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు. కొందరికి అయితే నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వారి విషయంలో తాత్కాలిక భరోసాకే ఆలోచిస్తామని చెబుతూ వచ్చారు. కానీ జగన్ గురించి తెలిసిన వారు మాత్రం ఎన్నికల ముంగిట బోస్ కి తప్పకుండా దెబ్బేస్తారని చెబుతున్నారు. తోట త్రిమూర్తుల నుంచి తమ్మినేని సీతారాం వరకు.. చివరకు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు సైతం వారసుల విషయంలో జగన్ నో చెప్పినట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది.