National

సూర్యుడా రెడీ గా ఉండు .. మా ISRO వస్తోంది – కొత్త ప్రాజెక్ట్ అద్దిరింది గురూ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమైంది. ఇప్పటికే చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది.

చంద్రయాన్ – 3 ని ప్రయోగించి విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ చేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ దృవంపై కాలుమోపిన మొదటి దేశంగా రికార్డుకు ఎక్కింది. అలాగే చంద్రుడిపై రోవర్ ను పంపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలంపై రోవర్ పరిశోధించి కీలక సమాచారాన్ని ఇస్రో కు పంపుతోంది. తాజాగా ఇస్రో మరో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

 

సూర్యుడిపై పరిశోధనల కోసం మరో ప్రతిష్టాత్మక ప్రయోగం ఆదిత్య ఎల్ 1 కు రందం సిద్దమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లో ఇవేళ మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 23 గంటలకు పైగా ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. శనివారం (సెప్టెంబర్ 2) ఉదయం 11.50 గంటలకు ఆదిత్య – ఎల్ 1 ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ సీ – 57 నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి రహస్యాలు గుట్టువిప్పడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో.

సూర్యుడి అయిస్కాంత క్షేత్రంలో సంభవించే మార్పులు.. కరోనియంలో ఉన్న పదార్ధాలు.. సౌర తుఫానులను అధ్యయనం చేయడానికి భారత్ తొలిసారిగా ప్రయోగం చేస్తొంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఎజన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. ప్రయోగాన్ని వీక్షించేందుకు సాధారణ పౌరులకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందు కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు రేపు ప్రయోగాన్ని వీక్షించవచ్చు.

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. ఇందులోని శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుండి సూర్యుని దిశగా 15 లక్షల కిలో మీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధయనం చేసేందుకు వీలు లభిస్తుంది. ఆదిత్య – ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకువెళ్లనుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్ సీ) తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, అదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజీ ఫర్ అదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, మాగ్నేటోమీటర్ పెలోడ్ లను అమర్చనున్నారు. సూర్యుడిలోని పొరలైన పొటోస్పెయర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్ – 1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

మరో పక్క చంద్రయాన్ – 3 మిషన్ లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల పరిశోధనా కాలంలో.. ఇక ఆరు రోజులు మాత్రమే మిలిగి ఉన్నాయి. చంద్రుడి దక్షిణ దృవంలో .. ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికితో పాటు ఉష్ణోగ్రతల్లో మార్పులను చంద్రయాన్ 3 ఇప్పటికే గుర్తించింది.