National

యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక రంగాలపై దృష్టి

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్న తరుణంలో యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక రంగాలపై దృష్టిసారిస్తోంది. అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం యోగీ ..

తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరుతో నడుస్తున్న అటల్ రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించారు. వాటి పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ విలువలతో గురుకుల విధానంలో నడుస్తున్న ఈ స్కూళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు.

అటల్ రెసిడెన్షియల్ స్కూల్ గురువర్త సంగం పేరుతో తాజాగా ఈ స్కూళ్లలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. 12 నుంచి 15 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అటల్ రెసిడెన్షియల్ పాఠశాలలు రాష్ట్రంలోని 18 డివిజన్లలో పనిచేస్తున్నాయని, సిబిఎస్‌ఇ నమూనాను అనుసరిస్తున్నాయని ఆదిత్యనాథ్ చెప్పారు.

ఈ పాఠశాలలు నైపుణ్యాభివృద్ధికి కేంద్రాలుగా ఉంటాయని, అట్టడుగు, వెనుకబడిన వర్గాల పిల్లల సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని 57 జిల్లాల్లో ఇలాంటి పాఠశాలలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. భారతరత్న అవార్డు గ్రహీత వాజ్‌పేయి పేరు మీదుగా పాఠశాలలకు పేరు పెట్టారని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యం ఉందన్నారు. పం0డిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ సిద్ధాంతాన్ని సాకారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఉత్తరప్రదేశ్ 18 అటల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని యోగీ తెలిపారు.

ఈ సందర్భంగా అటల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఎంపికైన విద్యార్థులకు స్కూల్‌ కిట్‌లను పంపిణీ చేసి భవిష్యత్తులో వారు విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే ఈ పాఠశాలల వెబ్‌సైట్లను https://www.atalvidyalaya.org www.atalvidyalaya.org కూడా ఆయన ప్రారంభించారు. కోవిడ్ కాలంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం బాల సేవా యోజన (శిశు సంక్షేమ పథకం) ప్రారంభించబడిందని, ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఈ పిల్లలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆదిత్యనాథ్ చెప్పారు.