National

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది. వైఎస్సార్ వర్దంతి నాడు షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ తప్పు లేదనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ పైన సోనియాకు అభిమానం ఉందన్నారు. ఇక, షర్మిల పాలేరు నుంచి పోటీకి హామీ లభించిందనే ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అటు ఖమ్మం..ఇటు బెంగళూరు కేంద్రంగా ఆసక్తి కర రాజకీయం మొదలైంది. షర్మిల నిర్ణయం కీలకం కానుంది.

సోనియాతో భేటీలో క్లారిటీ : వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక నిర్ణయం నాటి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో చేరినా షర్మిల సేవలను ఏపీకి పరిమితం చేయాలని కోరుతున్నారు. కానీ, హైకమాండ్ షర్మిలను పార్టీలో చేర్చుకోవాటినికి నిర్ణయించింది. షర్మిల ఢిల్లీలో సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు.

ఆ సమయంలో వైఎస్ గురించి తమ మనసులో ఉన్న అభిమానాన్ని సోనియా, రాహుల్ చాటుకున్నారని షర్మిల చెబుతున్నారు. వైఎస్సార్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చటం వెనుక సమాచారం లోపం ఉందని, వాళ్లు రియలైజ్ అయ్యారని షర్మిల చెప్పుకొచ్చారు. పార్టీలో ప్రాధాన్యతతో పాటుగా, పార్టీ నుంచి పోటీ పట్ల సానుకూలంగా స్పందించారని సమాచారం. దీంతో, షర్మిల లోక్ సభకు పోటీ చేస్తారనే వాదన ఉన్నా..పాలేరు నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

తుమ్మల ఇంటికి పొంగులేటి : సరిగ్గా ఇదే సమయంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఉప్పు – నిప్పులా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కటయ్యారు.తుమ్మల నివాసానికి పొంగులేటి వెళ్లారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడటం దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తోంది.

ఇక హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మంలోనికి తుమ్మల నివాసానికి వచ్చిన పొంగులేటి – కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. ఆయన రాక కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. రెండు రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లో తుమ్మలతో భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని తుమ్మలను రేవంత్‌ ఆహ్వానించారు.

పాలేరు దక్కేదెవరికి : ఇప్పటికే తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగానే జరుగుతోంది. పాలేరు నుంచే పోటీకి తుమ్మల పట్టబడుతున్నట్లు తెలుస్తోంది. అటు షర్మిలకు పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. షర్మిల తాను కోరుకుంటున్నట్లుగా పాలేరు నుంచి బరిలోకి దిగటానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం చేసినట్లు సమాచారం. దీంతో, రేవంత్ తాజాగా బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.

తుమ్మల పార్టీలో చేరిక, పాలేరు సీటు కేటాయింపు వంటి వాటితో పాటుగా పార్టీలో కొత్త నేతల చేరికలపైనా చర్చించారు. ఇటు షర్మిల పాలేరు పైన పోటీ విషయంతో త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. దీంతో, ఇప్పుడు పాలేరు నుంచి షర్మిల, తుమ్మలలో ఎవరికి సీటు దక్కుతుంది..దక్కని వారు ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.