గత రెండు మూడు నెలల క్రితం క్రితం వరకూ టమాటతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులను బెంబేలెత్తించాయి. అయితే, గత కొద్ది రోజులుగా టమాట ధర భారీగా తగ్గిపోయింది.
దీంతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా పడిపోయాయి. పంటల సప్లై పెరగడంతో ఇది సాధ్యమైంది. దీంతో కూరగాయలు కొనుగోలు చేసే వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో పంట పండించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల క్రితం వరకు కిలో 200 రూపాయలు ఉన్న టమాటా ధరలు.. ఇప్పుడు రైతు బజార్లలో 15 రూపాయలకి పడిపోయింది. మరికొన్ని బహిరంగ మార్కెట్‌లలో ధరలను చూసుకుంటే కిలో 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు గతంలో పచ్చిమిర్చి కూడా కిలోకు 200 రూపాయలకు దాటింది. అయితే ఇప్పుడు రైతు బజార్లలో కిలో 25 రూపాయలకు దిగివవచ్చింది.
కూరగాయల పంటలు చేతిలోకి రావడం వల్ల మార్కెట్లకు అన్ని రకాల పంటలు చేరుతున్నాయి. దీంతో కూరగాయల ధరలు మళ్లీ యథాతథా స్థితికి పడిపోయాయి. కాగా, వేసవి కాలంలో అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అలాగే జూన్ నెలలో కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.
ఎక్కడ చూసినా కూరగాయల కొరత.. ముఖ్యంగా టమాటాల కొరత కనిపించింది. ఇలా ఉత్పత్తి తగ్గిపోవడంతో జూన్ రెండోవారం నుంచి కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. ముందుగా టమాటా ధరలు బాగా పెరిగాయి. ఆ తర్వాత ఇతర కూరగాయలపైనా ప్రభావం పడింది. ఇక జూన్ మూడోవారంలో కిలో టమాటా ధరలు 100 రూపాయలు దాటాయి. ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ 200 రూపాయలకు చేరుకుంది. ఆగస్టు రెండవ వారం వరకు కూడా ఆ ధరలు అలాగే ఉన్నాయి.
ఆ తర్వాత నుంచి క్రమంగా ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర 15 రూపాయలకు పడిపోయింది. అలాగే బెండకాయ, బీరకాయ, కాకార, బీన్స్ లాంటి కూరగాయల ధరలు 20 నుంచి 30 రూపాయల వరకు పలుకుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మహబూబ్‌నగర్, వికారాబాద్, సిద్ధిపేట్, కరీనంగర్, నిజామాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి.
హైదరాబాద్‌లో మెహదీపట్నం మార్కెట్‌కు రోజూ 80 క్వింటాళ్లు, ఎర్రగడ్డ మార్కెట్‌కు 110 క్వింటాళ్ల టమాటాలు వస్తున్నాయి. మిగతా కూరగాయలు కూడా 1000 టన్నులకు పైగా వస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల మార్కెట్లకు టమాటలు సరఫరా విపరీతంగా పెరిగింది. ఇకనుంచి ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్లకు సంబంధించిన అధికారులు చెబుతున్నారు. దీంతో సామాన్యులకు భారీ ఊరట లభించనుంది.