ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి శనివారం రాత్రి 9.30 గంటలకు వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ బయలుదేరుతున్నారు.
అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలుసుకుంటారు. ఈనెల 12వ తేదీన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. యూకే పర్యటనకు ప్లాన్ చేసుకొని అనుమతివ్వాలంటూ కోర్టును కోరారు. సెప్టెంబరు 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పర్యటించడానికి కోర్టు అనుమతిచ్చింది. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ పర్యటనకు అనుమతివ్వాలని విజయసాయిరెడ్డి తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. విశ్వవిద్యాలయాలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉందనే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. కోర్టు అనుమతివ్వడంతో ఆయన కూడా విదేశాలకు వెళ్లనున్నారు. లండన్ పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకున్న వెంటనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధికి కుమారుడు జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సతీసమేతంగా ఇడుపులపాయకు వెళ్లిన జగన్ తల్లి విజయమ్మ, మరికొందరి కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందుగా ఆయన తన ట్విటర్ ఖాతాలో తండ్రి వైఎస్ ను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.