National

భారతీయ రైల్వే సంచలన నిర్ణయం

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది.

దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో ఇవి పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాలమధ్య మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది రైళ్లకు బదులుగా వందేభారత్ రైళ్లను నడుపుతామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.

రాజధాని ఎక్స్ ప్రెస్ పేరుతో నడుస్తున్న రైళ్ల విషయంలోను వాటికి బదులుగా వందే భారత్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 54 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. 1969 మార్చి 1న తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు తీసింది. వేర్వేరు నగరాల నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంటున్నాయి కాబట్టి రాజధాని ఎక్స్ ప్రెస్ అనే పేరు పెట్టారు.

ఇది ప్రీమియం రైలు. వేల కిలోమీటర్లను కవర్ చేస్తుంది. అన్నీ ఎయిర్ కండీషన్డ్ బోగీలే ఉంటాయి. టికెట్ ఛార్జీలోనే ఆహార ఛార్జీలు కలిపి ఉంటాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం 24 మార్గాల్లో రాజధాని నడుస్తోంది. ఒకే ట్రాక్‌పై వేర్వేరు రైళ్లు ప్రయాణిస్తున్నట్లైతే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. చెన్నై-న్యూఢిల్లీ రాజధాని విజయవాడ, వరంగల్ మీదగా, బెంగళూరు-న్యూఢిల్లీ రాజధాని సికింద్రాబాద్ మీదగా ప్రయాణిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సికింద్రాబాద్-న్యూఢిల్లీ రాజధాని అందుబాటులో ఉంది. వీటిస్థానంలో వందే భారత్ రైళ్లను ప్రవేశపెడితే ఆధునిక సౌకర్యాలు రైలు ప్రయాణ అనుభూతి ప్రయాణికుల సొంతమవుతుంది.