National

ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక సోదరుడికి ఉద్యోగం: మంత్రి కేటీఆర్ హామీ!!

ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రవళిక కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని ప్రవళిక కుటుంబ సభ్యులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

అర్హతలను బట్టి ఆమె సోదరుడికి మానవతా కోణంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పిస్తానని ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన గ్రూప్2 అభ్యర్ధి మర్రి ప్రవళిక కుటుంబసభ్యులు బుధవారం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ ప్రవళిక చదువు, కుటుంబ నేపథ్యం అన్నీ తెలుసుకున్నారు. ప్రవళిక మరణం తనను బాగా కదిలించిందని, ఆమె మరణం చాలా దురదృష్టకరమన్న మంత్రి ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపి సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే అన్ని వివరాలు తాను డీజీపీ ద్వారా తెలుసుకున్నానని అన్నారు.. అయితే ప్రవళిక మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణం అని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్ ను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, ప్రవళిక మరణం వెనుక ఎంతటి వారున్న వదిలిపెట్ట బోమని అన్నారు.

ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు.. అలాగే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న మంత్రి మానవతా కోణంలో ప్రవళిక సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని వారికి హామీ ఇచ్చారు… రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ప్రవళిక ఆత్మహత్యపై పెద్ద దుమారమే రేపింది.

గ్రూప్ 2 ఉద్యోగాలు వాయిదా పడటం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందంటు పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. కానీ ఆమె ఆత్మహత్యకు శివరాం అనే వ్యక్తి వేధింపులే కారణమని తెలియడంతో కథ మలుపు తిరిగింది . దీంతో శివరాం ను శిక్షించాలని కోరుతూ వారు మంత్రిని కలవడంతో మంత్రి వారి కుటుంబానికి హామీ ఇచ్చారు.