National

ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం

న్యూఢిల్లీ: ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పార్లమెంట్ సమావేశాలు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి.

ఓటర్లను ఆకట్టుకునే దిశగా కేంద్రం ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు, బిల్లులను ప్రవేశపెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు. అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం లేదా, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇవ్వాళ సమావేశమైన ఇండియా సమన్వయ కమిటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి- సీట్ల పంపకాలపైనా తుది నిర్ణయానికి వచ్చారు సమన్వయ కమిటీ సభ్యులు.

శరద్ పవార్- ఎన్సీపీ, కేసీ వేణుగోపాల్- కాంగ్రెస్, టీఆర్ బాలు- డీఎంకే, తేజస్వి సూర్య- ఆర్జేడీ, సంజయ్ రౌత్- శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), సంజయ్ ఝా- జనతాదళ్ (యునైటెడ్), హేమంత్ సోరెన్- జార్ఖండ్ ముక్తి మోర్చా, రాఘవ్ ఛద్దా- ఆమ్ ఆద్మీ పార్టీ, డీ రాజా- సీపీఐ, ఒమర్ అబ్దుల్లా- నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ- పీడీపీ, జావెద్ అలీ- సమాజ్‌వాది పార్టీ.. ఇందులో పాల్గొన్నారు.

ఇందులో చర్చకు వచ్చిన అంశాల గురించి కేసీ వేణుగోపాల్ విలేకరులకు వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్లు వివరించారు. సభ్య పార్టీల నేతలతో చర్చలు జరిపి, వీలైనంత త్వరగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు అభిప్రాయపడినట్లు చెప్పారు.

అక్టోబరు మొదటి వారంలో భోపాల్‌లో ఉమ్మడి మొదటి సభను నిర్వహించబోతోన్నామని అన్నారు. ఈ సభ- ఇండియా బ్లాక్ ఉమ్మడి అజెండాకు అద్దం పడుతుందని, అందులో ప్రస్తావనకు వచ్చే అంశాలన్నీ అందరి ఆమోదం పొందినవే అవుతాయని చెప్పారు. ఏ తేదీన సభ నిర్వహించాలనేది త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.